అదానీ చేతికి గోపాల్‌పుర్‌ పోర్ట్‌

ఒడిశాలోని గోపాల్‌పుర్‌ పోర్ట్‌ను రూ.3,350 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువ వద్ద రూ.1349 కోట్లకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌కు (ఏపీఎస్‌ఈజడ్‌) విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూపు మంగళవారం వెల్లడించింది.

Published : 27 Mar 2024 01:17 IST

రూ.1,349  కోట్లకు విక్రయించిన ఎస్‌పీ గ్రూపు

దిల్లీ: ఒడిశాలోని గోపాల్‌పుర్‌ పోర్ట్‌ను రూ.3,350 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువ వద్ద రూ.1349 కోట్లకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌కు (ఏపీఎస్‌ఈజడ్‌) విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూపు మంగళవారం వెల్లడించింది. నిర్మాణ దశలోనే ఈ పోర్టును 2017లో ఎస్‌పీ గ్రూపు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ పోర్టు హ్యాండ్లింగ్‌ సామర్థ్యం సంవత్సరానికి 20 మిలియన్‌ టన్నులు. ఎల్‌ఎన్‌జీ రీగ్యాస్‌ఫికేషన్‌ టర్మినల్‌ ఏర్పాటు నిమిత్తం ఇటీవలే పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీతో గోపాల్‌పుర్‌ పోర్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల దీర్ఘకాలంలో పోర్ట్‌కు ఆదాయం పెరగొచ్చన్నది అంచనా. గోపాల్‌పుర్‌ పోర్టులో ఎస్‌పీ గ్రూపునకు చెందిన 56% వాటాను, ఒడిశా స్టీవ్‌డోర్స్‌ లిమిటెడ్‌కు చెందిన 39% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఏపీఎస్‌ఈజడ్‌ తెలిపింది.

గత కొన్ని నెలల్లో ఎస్‌పీ గ్రూపు వాటా విక్రయించిన రెండో పోర్ట్‌ ఇది. మహారాష్ట్రలో ఉన్న ధరమ్‌తార్‌ పోర్ట్‌లో వాటాను జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.710 కోట్ల విలువ వద్ద ఎస్‌పీ గ్రూపు విక్రయించింది. ఆ పోర్ట్‌ను ఎస్‌పీ గ్రూపు 2015లో కొనుగోలు చేసినప్పుడు, పోర్ట్‌ వార్షిక సామర్థ్యం 1 మిలియన్‌ టన్నుల లోపే ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సామర్థ్యం 5 మిలియన్‌ టన్నులకు చేరుతుందనే అంచనా ఉంది.
‘ధరమ్‌తార్‌, గోపాల్‌పుర్‌ పోర్ట్‌లలో గణనీయ విలువ వద్ద వాటా విక్రయించడం ద్వారా, స్వల్పకాలంలో వాటాదార్లకు మంచి విలువను సృష్టించడం, ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణంలో మాకున్న బలాన్ని తెలియజేస్తోంద’ని షాపూర్జీ పల్లోంజీ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకోవడానికే కాకుండా, వృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఈ విక్రయ లావాదేవీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌పీ గ్రూపునకు సుమారు రూ.20,000 కోట్ల అప్పు ఉంది. తమ వినియోగదార్లకు సేవలను మరింతగా అనుసంధానం చేసేందుకు గోపాల్‌పుర్‌ పోర్ట్‌ కొనుగోలు ఉపయోగపడుతుందని ఏపీఎస్‌ఈజడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని