ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్‌ల వాటా

ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్‌ల (ఎంఎఫ్‌ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్‌ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌నకు చెందిన ప్రైమ్‌ఇన్ఫోబేస్‌.కామ్‌ వెల్లడించింది.

Published : 07 May 2024 02:45 IST

దిల్లీ: ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్‌ల (ఎంఎఫ్‌ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్‌ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌నకు చెందిన ప్రైమ్‌ఇన్ఫోబేస్‌.కామ్‌ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో రూ.81,539 కోట్ల నికర పెట్టుబడులు ఎంఎఫ్‌ల నుంచి ఈ కంపెనీల్లోకి తరలి వచ్చాయి. 2023 డిసెంబరు ఆఖరుకు ఈ కంపెనీల్లో ఎంఎఫ్‌ల వాటా 8.81 శాతంగా ఉంది. ఇదే సమయంలో దేశీయ అతి పెద్ద సంస్థాగత మదుపరి అయిన ఎల్‌ఐసీ వాటా 3.64% నుంచి 3.75 శాతానికి పెరిగింది. 280కి పైగా కంపెనీల్లో 1 శాతానికి పైగా వాటా ఎల్‌ఐసీ కలిగి ఉంది. ఎన్‌ఎస్‌ఈలో నమోదిత 1956 కంపెనీల్లో (మొత్తం 1989 కంపెనీలు) 2024 మార్చి ఆఖరుకు షేర్‌హోల్డింగ్‌ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మరో 33 కంపెనీల షేర్‌హోల్డింగ్‌ డేటా సమర్పించాల్సి ఉంది.

  • ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో దేశీయ సంస్థాగత మదుపర్ల (డీఐఐల) వాటా 15.96% నుంచి 16.05 శాతానికి పెరిగింది. ఇందులో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, పింఛను నిధులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) వస్తాయి. డీఐఐలు రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడంతో వీటి వాటా పెరిగింది.
  • మార్చి ఆఖరుకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐల) వాటా 11 ఏళ్ల కనిష్ఠమైన 17.68 శాతానికి దిగివచ్చింది. 2023 డిసెంబరు ఆఖరుకు ఇది 18.19 శాతంగా ఉంది.

ఎఫ్‌పీఐలను డీఐఐలు అధిగమిస్తారు: భారత మార్కెట్లు ఆత్మనిర్భరత (స్వావలంబన) దిశగా అడుగులు వేస్తున్నాయని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌ ఎండీ ప్రణవ్‌ హల్దియా వెల్లడించారు. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ఎఫ్‌పీఐల వాటాను డీఐఐల వాటా అధిగమించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రమోటర్‌గా ప్రభుత్వ యాజమాన్య వాటా ఏడేళ్ల గరిష్ఠానికి (10.38%) చేరింది. చాలా పీఎస్‌యూల బలమైన పని తీరు ఇందుకు కారణం. ప్రైవేటు ప్రమోటర్ల వాటా అయిదేళ్ల కనిష్ఠానికి (41%) పరిమితమైంది. బులిష్‌ మార్కెట్ల ప్రయోజనాన్ని పొందేందుకు ప్రైవేటు ప్రమోటర్లు వారి వాటాల్ని విక్రయించడమే ఇందుకు కారణం. రిటైల్‌ మదుపర్ల వాటా 7.58% నుంచి స్వల్పంగా తగ్గి 7.50 శాతంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని