Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...

మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated : 19 May 2024 11:01 IST

ఆఫీసుల్లో పెరుగుతున్న వినియోగం
ప్రపంచ సగటు 75 శాతం,  మనదేశంలో 92 శాతం...
మైక్రోసాఫ్ట్, లింక్‌డిన్‌ 2024 వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ నివేదిక
ఈనాడు - హైదరాబాద్‌

మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 92 శాతం మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తాజాగా ‘మైక్రోసాఫ్ట్, లింక్‌డిన్‌ 2024 వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌’  నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచ సగటు 75 శాతం మాత్రమే కావటం గమనార్హం. ఏఐ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుందని, సరికొత్త సేవలు ఆవిష్కరించే అవకాశం కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏఐ సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఏ వ్యాపార సంస్థకైనా ఏఐ వినియోగం తప్పనిసరి అని, తాము పనిచేసే కంపెనీలు ఏఐని విస్తృత స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని 91 శాతం మంది స్పష్టం చేశారు. తాము పనిచేస్తున్న సంస్థలకు ఏఐ ప్రణాళిక, దూరదృష్టి లేదని 54 శాతం ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మరోపక్క ఉద్యోగుల్లో 72 శాతం మంది తమ సొంత ఏఐ టూల్స్‌ను తాము పనిచేసే చోట వినియోగిస్తున్నారు. సృజనాత్మకత, అధికోత్పత్తి దీనివల్ల సాధ్యమవుతున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. 

అన్వేషణ పెరిగింది..

లింక్‌డిన్‌ జాబ్‌ పోస్టింగ్స్‌లో ఇటీవల కాలంలో ఏఐ ప్రస్తావన అధికంగా ఉంటోంది. ఇటువంటి ఉద్యోగాలు 17 శాతం పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఏఐ సామర్థ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నట్లు, అదే విధంగా ఏఐని అధికంగా వినియోగిస్తున్న కంపెనీలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షిస్తున్నట్లు వివరించింది. ఏఐ సామర్థ్యాలు లేని ఉద్యోగులను తాము ఉద్యోగాల్లోకి తీసుకోవటం లేదని దేశంలోని 75 శాతం కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సగటు 66 శాతం మాత్రమే కావటం గమనార్హం. తగినంత అనుభవం లేకపోయినా.. ఏఐ సామర్థ్యాలు ఉంటే చాలు- అనే రీతిలో కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న అభ్యర్ధులను తగినంత అనుభవం లేకపోయినా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని 80 శాతం కంపెనీలు తెలిపాయి. కోపైలెట్, చాట్‌జీపీటీ వంటి ఏఐ సామర్థ్యాలను సంపాదించిన లింక్‌డిన్‌ సభ్యుల సంఖ్య గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 142 శాతం పెరిగింది. అదేవిధంగా లింక్‌డిన్‌ కోర్సులను వినియోగించుకొని ఏఐ నైపుణ్యాలు సాధించిన నాన్‌-టెక్నికల్‌ అభ్యర్థుల సంఖ్య 160 శాతం పెరిగింది. 

 ప్రభుత్వ సంస్థల్లోనూ..

మనదేశంలో ఏఐ పవర్‌ యూజర్లలో 90 శాతం మంది తమ రోజును ఏఐ టూల్స్‌తో ప్రారంభిస్తున్నారు. రేపటి కోసం ఈరోజే సిద్ధం అయ్యే వారి సంఖ్య 91 శాతం ఉండటం ప్రత్యేకత. ఏఐ పవర్‌ యూజర్లకు  శిక్షణ, ఇతర కార్యకలాపాల్లో ప్రాధాన్యం లభిస్తోంది. కంపెనీల్లో సీఈఓ నుంచి ప్రాజెక్టు మేనేజర్ల వరకూ ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగులతోనే చర్చిస్తున్నారు.

బీఎఫ్‌ఎస్‌ఐ, ఆరోగ్య సేవలు, ఐటీఈఎస్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ ఇరినా ఘోష్‌ వివరించారు. ఏఐ టూల్స్, శిక్షణ, సంబంధిత అంశాలపై దృష్టి కేంద్రీకరించే వ్యాపార సంస్థలు సమీప భవిష్యత్తులో అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఉద్యోగుల నైపుణ్యాలను, వ్యాపార సంస్థల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్లు లింక్‌డిన్‌ హెడ్‌ (ట్యాలెంట్‌ అండ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌) రుచీ ఆనంద్‌ అభిప్రాయపడ్డారు. ఏఐ నైపుణ్యాలకు గత ఏడాదితో పోల్చితే గిరాకీ 17 శాతం పెరిగినట్లు తెలిపారు. కార్యాలయాల్లో జనరేటివ్‌ ఏఐ వినియోగం గత ఆరు నెలల్లోనే రెట్టింపు అయినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లింక్‌డిన్‌ సభ్యులు తమ ప్రొఫైళ్లు, బయోడేటాలకు ఏఐ నైపుణ్యాలను అధికంగా జోడిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఏఐ నైపుణ్యాలు సంపాదించాలనుకునే అభ్యర్థుల కోసం ‘కోపైలెట్‌ ఫర్‌ మైక్రోసాఫ్ట్‌ 365’ లో కొత్త సామర్థ్యాలను జోడించినట్లు, అంతేగాక 50 లెర్నింగ్‌ కోర్సులు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని