10 శాతం రాబడి వస్తుందా?

ఒకేసారి రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి, నెలకు రూ.10వేలు కావాలంటే.. ఏడాదికి రూ.1,20,000. అంటే దాదాపు 10 శాతం రాబడి ఆర్జించాలి.

Updated : 02 Sep 2022 05:10 IST


* డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో ఒకేసారి రూ.12లక్షల వరకూ మదుపు చేసి, నెలకు రూ.10వేల వరకూ వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ మేరకు నేను రాబడిని ఆర్జించే అవకాశం ఉందా? క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలి?

- రాజేంద్ర

ఒకేసారి రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి, నెలకు రూ.10వేలు కావాలంటే.. ఏడాదికి రూ.1,20,000. అంటే దాదాపు 10 శాతం రాబడి ఆర్జించాలి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో ఇంత రాబడి ఆర్జించడం సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా వీటిల్లో 6 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. డెట్‌ ఫండ్లలో స్వల్ప నష్టభయం ఉంటుందని గమనించాలి. ఒకేసారి వీటిల్లో మదుపు చేసి, క్రమానుగతంగా వెనక్కి తీసుకోవడం ఒక మార్గం. ప్రత్యామ్నాయంగా బ్యాంకులో నాన్‌ క్యుములేటివ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కం స్కీం (గరిష్ఠంగా రూ.4.5లక్షల వరకూ జమ)నూ పరిశీలించవచ్చు.


* నాలుగేళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నాను. ఈఎంఐ రూ.32,000. ఇటీవల నాకు వేతనం పెరిగింది. ఈ నేపథ్యంలో వాయిదా మొత్తాన్ని పెంచుకోవడం మంచిదేనా? లేకపోతే ఏదైనా పథకంలో మదుపు  చేయాలా?

- వేణుగోపాల్‌

గృహరుణానికి చెల్లించిన వడ్డీకి ఆదాయపు పన్ను సెక్షన్‌ 24 కింద రూ.2లక్షల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. మీ రుణం అసలు రూ.25లక్షలపైన ఉంటే ఆ పై మొత్తాన్ని తీర్చేయండి. రూ.25 లక్షలకన్నా తక్కువగా ఉంటే ఇదే ఈఎంఐని కొనసాగించండి. మీ దగ్గరున్న మిగులు మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. 8 ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని తీసి, గృహరుణాన్ని తీర్చేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీకు పన్ను మినహాయింపు, కాస్త అధిక రాబడీ లభించే అవకాశం కలుగుతుంది.


* రికరింగ్‌ డిపాజిట్‌లో నెలకు రూ.5వేలు జమ చేస్తున్నాను. ఇదే తరహాలో సురక్షితంగా ఉంటూ కాస్త అధిక రాబడిని ఆర్జించే మార్గమేదైనా ఉందా? కనీసం ఆరేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించగలను. ఎంత మొత్తం జమ అవుతుంది?

- శ్రావణి

అధిక రాబడి కోసం కాస్త నష్టభయం ఉన్న పథకాలను ఎంచుకోవాలి. దీనికోసం సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనికి మీరు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌, ఈక్విటీ హైబ్రీడ్‌ ఫండ్లను పరిశీలించండి. సగటున 11 శాతం రాబడితో నెలకు రూ.5వేలు మదుపు చేస్తే.. ఆరేళ్ల తర్వాత రూ.4,75,000 చేతికి వచ్చే అవకాశం ఉంది.


* మా సంస్థ నుంచి రూ.4లక్షలకు ఆరోగ్య బీమా పాలసీ ఉంది. సొంతంగా మరో పాలసీ తీసుకోవడం కన్నా.. దీనికి సూపర్‌ టాపప్‌లాంటివి ఎంచుకోవడం మంచిదేనా? 

- కృష్ణ

పూర్తిగా బృంద బీమాపైనే ఆధారపడటం ఎప్పుడూ మంచిది కాదు. మీరు సొంతంగా ఒక పాలసీని తీసుకోండి. దానిపై సూపర్‌ టాపప్‌ తీసుకోవడం ఉత్తమం. మీ కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.5లక్షల పాలసీని తీసుకోండి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని