పెట్టుబడుల వివరాలు తెలుస్తాయా?

మా అమ్మాయి వయసు 4. తన పేరుమీద వీలైనప్పుడల్లా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. మరో 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం అవుతుంది.

Published : 17 Nov 2023 01:03 IST

మా అమ్మాయి వయసు 4. తన పేరుమీద వీలైనప్పుడల్లా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. మరో 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం అవుతుంది. ఒకటి రెండు మంచి షేర్లను ఎంచుకొని, వాటిలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయా?

ప్రదీప్‌

మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపైన తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడిని క్రమశిక్షణతో, దీర్ఘకాలం కొనసాగిస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు మంచి షేర్లు ఎంచుకొని, మదుపు చేయొచ్చు. కానీ, అవి రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవడం సాధ్యం కాదు. నిరంతరం వాటిని గమనిస్తూనే ఉండాలి. దీనికి బదులుగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని నెలనెలా మదుపు చేసేందుకు ప్రయత్నించండి. క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలోకి మళ్లించండి. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి రాబడికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడిని ఏడాదికోసారి సమీక్షించుకుంటే సరిపోతుంది.


నా వయసు 36. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోలేదు. కుటుంబంలో అందరికీ విడివిడిగా రూ.5లక్షల చొప్పున పాలసీ తీసుకోవడం మంచిదా? లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ సరిపోతుందా?

ఆనంద్‌

ప్రస్తుతం వైద్య చికిత్సల ఖర్చు అధికంగా ఉంటోందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఇకపై ఆలస్యం చేయొద్దు. రూ.5లక్షల చొప్పున విడివిడిగా కాకుండా, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవడమే మేలు. వేర్వేరుగా తీసుకుంటే ప్రీమియం అధికంగా ఉంటుంది. కొత్తగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీల్లోనే వ్యక్తిగత పాలసీల తరహాలో విడివిడిగా రక్షణ లభిస్తోంది. వీటిని తీసుకోవచ్చు. రూ.10లక్షలకు తగ్గకుండా బీమా పాలసీ ఉండేలా చూసుకోండి.


నా స్నేహితుడు ఇటీవలే మరణించాడు. అతను కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మదుపు చేశాడన్న సంగతి తెలుసు. కానీ, దానికి సంబంధించిన వివరాలేమీ కనిపించడం లేదు. వీటి గురించి సమాచారం తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా?

విజయ్‌

సాధారణంగా పెట్టుబడులు పెట్టినప్పుడు వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటాయి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు అలాంటివి ఉండవు. నెలనెలా పెట్టుబడికి సంబంధించిన వివరాలు మాత్రమే స్టేట్‌మెంట్‌ రూపంలో అందుతాయి. వీటినీ ఫండ్‌ సంస్థలు ఇ-మెయిల్‌లోనే పంపిస్తాయి. మీ స్నేహితుడి ఇ-మెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లను పరిశీలించే అవకాశం ఉందా చూడండి. ఒకవేళ చూడగలిగితే అందులో ‘ఈసీఏఎస్‌’ అని ఏమైనా ఉందా పరిశీలించండి. వాటిని పరిశీలిస్తే.. ఫండ్ల పెట్టుబడుల గురించి సులభంగా తెలుసుకోవచ్చు. బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించినా కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


మా అబ్బాయి వయసు 14. తన పేరుమీద మనీ బ్యాక్‌ పాలసీలాంటివి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?

రాజీవ్‌

పిల్లల పేరుమీద పాలసీ తీసుకోవడం కన్నా.. కుటుంబంలో ఆర్జించే పెద్ద పేరిట టర్మ్‌ పాలసీ తీసుకోవడం మంచిది. మనీ బ్యాక్‌ పాలసీలో సాధారణంగా 4-6 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రాబడి రావాలనుకుంటే.. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని