Share Market: షేర్లలో మదుపు చేస్తే లాభమేనా?

మా అమ్మాయి వయసు ఆరేళ్లు. తన భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

Updated : 20 Oct 2023 09:11 IST

మా అమ్మాయి వయసు ఆరేళ్లు. తన భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

శశాంక్‌

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. మీ పేరుపైన తగిన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణానికి మించి రాబడినిచ్చేలా ఉండాలి. మదుపు చేయాలనుకుంటున్న రూ.10వేలలో రూ.4వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా రూ.6వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.


మూడు నెలల క్రితం ఉద్యోగంలో చేరాను. నా వయసు 23. జీతం రూ.22 వేల వరకూ వస్తోంది. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

వినయ్‌

మీపై ఆధారపడిన వారుంటే.. ముందుగా మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా జీవిత బీమా పాలసీ తీసుకోండి. మీ కార్యాలయం నుంచి బృంద ఆరోగ్య బీమా వెసులుబాటు ఉన్నా, సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధి సిద్ధం చేసుకోండి. దీర్ఘకాలంపాటు పెట్టుబడిని కొనసాగించే లక్ష్యం ఉంటే మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో 30 శాతం పీపీఎఫ్‌లో జమ చేయండి. 70 శాతాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు కేటాయించండి. రెండు మూడేళ్లలో డబ్బు అవసరం ఉంటే రికరింగ్‌ డిపాజిట్‌ చేయండి.


మా నాన్న వయసు 62 ఏళ్లు. తన పేరుపై ఒకేసారి రూ.8లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, వడ్డీ వచ్చే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికోసం మంచి పథకాలు సూచించండి.

ప్రభాకర్‌

ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్లకు దాదాపు 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. నాన్‌క్యుములిటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే నెలనెలా వడ్డీని వెనక్కి తీసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఇందులో 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు.


నెలకు రూ.15 వేల వరకూ షేర్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. కనీసం 10 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు?

సుధీర్‌

నేరుగా షేర్లలో మదుపు చేయడం కొంచెం నష్టంతో కూడుకున్నదే. దీనికి ఎంతో అవగాహన ఉండాలి. మంచి షేర్లను ఎంచుకునే నైపుణ్యం ఉండాలి. హెచ్చుతగ్గులను తట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మార్పులు చేర్పులు చేసుకోగలగాలి. ఇవన్నీ మీకు సాధ్యమే అనుకుంటే.. షేర్లలో మదుపు చేయొచ్చు. కానీ, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దీనికి బదులుగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. 10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే మంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంది. నెలకు రూ.15వేల చొప్పున 10 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే సగటున 13 శాతం రాబడితో రూ.33,15,554 అయ్యే అవకాశం ఉంది. 

-తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని