యులిప్‌ను రద్దు చేయొచ్చా?

నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30 వేల వరకూ చేతికి వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనే    ఆలోచనతో ఉన్నాను.

Published : 19 Jan 2024 00:06 IST

  • నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30 వేల వరకూ చేతికి వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనే    ఆలోచనతో ఉన్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి?

మణి

ఆర్థికంగా మీపై ఆధారపడిన వారుంటే.. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ జీవిత బీమా పాలసీని తీసుకోండి. దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా పాలసీలూ ఉండాలి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా సిద్ధం చేసుకోండి. మీరు దీర్ఘకాలం కోసం మదుపు చేయాలనుకుంటే.. మీ పెట్టుబడిలో రూ.3వేలను ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. మిగతా రూ.7వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయండి.


  • మా అబ్బాయి వయసు 14. తన ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకొని, నెలకు రూ.30 వేలు మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

​​​​​​​ప్రభాకర్‌

  • మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు రక్షణ కల్పించండి. దీనికోసం తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీని తీసుకోండి. వచ్చే రెండేళ్ల తర్వాత నుంచి మీకు అధికంగా ఖర్చు ఉంటుంది. దానికి అనుగుణంగా సిద్ధం కావాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.15వేలను హైబ్రిడ్‌, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలోనూ, రూ.15వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోనూ పెట్టుబడి పెట్టండి.

నెలకు రూ.10 వేలను బంగారంలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఎలాంటి పథకాలను ఎంచుకోవడం మేలు?

సంధ్య

భవిష్యత్‌లో బంగారం కొనాలని అనుకున్నప్పుడే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవాలి. మంచి రాబడి కోసం చూస్తుంటే.. పసిడి ఫండ్లకు బదులు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించాలి. కనీసం అయిదు నుంచి ఏడేళ్లపాటు పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడే ఈ ఫండ్లలో మదుపు చేయాలి.


నా దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. వీటితో నాకు నాలుగేళ్ల తర్వాత అవసరం. కనీసం 18 శాతం రాబడి వచ్చేలా ఈ మొత్తాన్ని మదుపు చేయాలన్నది ఆలోచన. ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి?

రాజేశ్‌

  • స్టాక్‌ మార్కెట్ల పనితీరు గత మూడేళ్లుగా బాగుంది. దీంతో చాలామంది షేర్లలో మదుపు చేస్తే అధిక రాబడులు వస్తాయని, నష్టభయం ఉండదనే అపోహలో ఉంటున్నారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. కనీసం అయిదేళ్ల వ్యవధి ఉంటేనే మార్కెట్‌ ఆధారిత పథకాలను ఎంచుకోవాలి. గత మూడేళ్లలో మార్కెట్‌ 18 శాతం వరకూ రాబడినిచ్చింది. కానీ, భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని చెప్పలేం. 11-12 శాతం రాబడిని ఆశిస్తూ మదుపు చేయడం మంచిది. అంతకంటే ఎక్కువగా వస్తే అది అదనపు లాభంగానే భావించాలి. మీ పెట్టుబడికి నష్టభయం తక్కువగా ఉండి, మంచి రాబడి రావాలంటే.. హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి.

తుమ్మ బాల్‌రాజ్‌


  • నాలుగేళ్ల క్రితం యూనిట్‌ ఆధారిత పాలసీని తీసుకున్నాను. ఈ ఏడాది ఇంకా ప్రీమియం చెల్లించలేదు. ఇప్పుడు దీన్ని రద్దు చేసుకోవచ్చా? గడువు తీరేదాకా కొనసాగించాలా?

మధుకర్‌

  • యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)ను తీసుకున్నప్పుడు కనీసం అయిదేళ్లపాటు దానిని కొనసాగించాలి. నాలుగేళ్ల తర్వాత రద్దు చేసుకుంటే.. స్వాధీన రుసుములు వసూలు చేస్తారు. మిగతా మొత్తాన్ని డిస్కంట్యూన్డ్‌ పాలసీ ఖాతాలో జమ చేస్తారు. అయిదేళ్లు పూర్తయ్యాకే డబ్బును తిరిగి ఇస్తారు. అప్పటివరకూ నామమాత్రపు రాబడిని జమ చేస్తారు. మీరు తీసుకున్న యులిప్‌లో ఈక్విటీ ఫండ్లు ఉన్నాయా చూసుకోండి. ఈసారికి ప్రీమియం చెల్లించి, వచ్చే ఏడాది పాలసీని రద్దు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని