సంక్షిప్త వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరణ: బ్యాంకిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఫిన్‌టెక్‌ అంకురం బ్యాంకిట్‌ తెలిపింది.  ఔషధ దుకాణాలు, రీఛార్జి షాపులూ ఇందులో ఉండనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటికే 17,500లకు పైగా దుకాణాలకు తమ సేవలను అందిస్తున్నామని సంస్థ తెలిపింది. యూపీఐ ఆధారిత చెల్లింపులతో పాటు, మైక్రో ఏటీఎంల ఏర్పాటులాంటి సేవలను ఈ సంస్థ అందిస్తోంది. తెలంగాణ నుంచి స్థూల లావాదేవీల విలువ గత 6 నెలల్లో రూ.11,000 కోట్ల మేరకు ఉందని బ్యాంకిట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఓఓ అమిత్‌ నిగం తెలిపారు. .


హైదరాబాద్‌, విజయవాడల్లో బీవైడీ డీలర్‌షిప్పులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్‌ యువర్‌ డ్రీమ్స్‌) దేశ వ్యాప్తంగా డీలర్ల నియామకానికి ప్రయత్నాలు చేస్తోంది. వారెన్‌ బఫెట్‌ పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ తొలి దశలో హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ సహ 8 నగరాల్లో  డీలర్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు బీవైడీ పేర్కొంది. కొత్త ఈ6, ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ ఎంపీవీ వాహనాలను బీ2బీ వినియోగదారులకు అందించేందుకు ఈ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ తోడ్పడుతుందని బీవైడీ ఇండియా సేల్స్‌ హెడ్‌ (ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్‌) శ్రీరంగ్‌ జోషి తెలిపారు.


ఆనంద్‌ రాఠీ పబ్లిక్‌ ఇష్యూ రేపటి నుంచి
ధరల శ్రేణి రూ.530- 550

దిల్లీ: ముంబయి కేంద్రంగా ఆర్థిక రంగ సేవలను అందిస్తున్న ఆనంద్‌ రాఠీ వెల్త్‌ పబ్లిక్‌ ఇష్యూ రేపటి నుంచి (ఈనెల 2న) ప్రారంభమై 6న ముగియనుంది. ఇష్యూకు ధరల శ్రేణి రూ.530- 550. ఇందులో గరిష్ఠ ధర ప్రకారం.. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.660 కోట్లు సమకూరే అవకాశం ఉంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపేణా జరగనున్న ఈ పబ్లిక్‌ ఇష్యూలో వాటాదార్లు, ప్రమోటర్లు 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక లాట్‌కు 27 షేర్ల చొప్పున మదుపర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇనుప ఖనిజం ధరలు తగ్గించిన ఎన్‌ఎమ్‌డీసీ

దిల్లీ: ఇనుప ఖనిజం ధరలను ఎన్‌ఎమ్‌డీసీ తగ్గించింది. అత్యధిక గ్రేడ్‌ ధరను టన్నుకు రూ.750, తక్కువ గ్రేడ్‌ ధరను టన్నుకు రూ.200 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ రెండింటి ధరలు వరుసగా రూ.5,200; రూ.4,560కి దిగివచ్చాయి. ఇంతకుముందు ఇవి రూ.5,950; రూ.4,760గా ఉన్నాయి. ఈ ధరల తగ్గింపు అమల్లోకి వచ్చిందని ఎన్‌ఎమ్‌డీసీ పేర్కొంది. పైన చెప్పిన ధరలో రాయల్టీ, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌, సెస్సు, అటవీ అనుమతి రుసుము, ఇతర పన్నులు కలిపిలేవని తెలిపింది. ఉక్కు తయారీలో ఇనుప ఖనిజం కీలక ముడి సరుకు.  


ఇన్నోవేట్‌ 5జీతో సిగ్నిటీ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, క్వాలిటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌, ఇన్నోవేట్‌5జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంస్థలు తమ వ్యాపార, వినియోగదారు అప్లికేషన్లను రూపొందించేందుకు వీలుగా డిజిటల్‌ అస్యూరెన్స్‌ సేవలను అందించేందుకు ఇది తోడ్పడుతుందని సిగ్నిటీ పేర్కొంది.


ఇన్ఫోచిప్స్‌లో మరో 250 ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, సెమీకండక్టర్‌ డిజైనింగ్‌ సేవలను అందించే ఇన్ఫోచిప్స్‌ (ఆరో ఎలక్ట్రానిక్స్‌ గ్రూపు) హైదరాబాద్‌లోని తన కార్యాలయాన్ని విస్తరించనుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వచ్చే 6 నెలల్లో కొత్తగా 100 మంది ఇంజినీర్లను నియమించుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా 250 మందిని తీసుకుంటామని పేర్కొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని