సంక్షిప్త వార్తలు

కరోనా వంటి సవాళ్ల నేపథ్యంలోనూ చైనా ఆర్థిక వ్యవస్థ గత ఏడాది(2021)లో 8.1 శాతం వృద్ధి చెందింది. దేశ జీడీపీ 114.37 లక్షల కోట్ల యువాన్‌ల(18 లక్షల కోట్ల డాలర్ల)కు చేరి దశాబ్దంలోనే అత్యుత్తమంగా రాణించిందని

Published : 18 Jan 2022 02:17 IST

2021లో చైనా వృద్ధి 8.1 శాతం

బీజింగ్‌: కరోనా వంటి సవాళ్ల నేపథ్యంలోనూ చైనా ఆర్థిక వ్యవస్థ గత ఏడాది(2021)లో 8.1 శాతం వృద్ధి చెందింది. దేశ జీడీపీ 114.37 లక్షల కోట్ల యువాన్‌ల(18 లక్షల కోట్ల డాలర్ల)కు చేరి దశాబ్దంలోనే అత్యుత్తమంగా రాణించిందని ఆ దేశ ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(ఎన్‌బీఎస్‌) సోమవారం తెలిపింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 6 శాతం కంటే; రెండేళ్ల సగటు అయిన 5.1 శాతం కంటే ఇది అధికమని తెలిపింది.

అయిదో ఏడూ తగ్గిన జనన రేటు: చైనా జనాభా గతేడాది చివరకు 141.26 కోట్లకు చేరింది. వరుసగా అయిదో ఏడాదీ జననాల రేటు తగ్గింది. 2020 జనాభా 141.20 కోట్లతో పోలిస్తే, అత్యంత స్వల్పంగా పెరిగింది.


కియా కారెన్స్‌కు ఒక రోజులోనే భారీ స్పందన

దిల్లీ: కియా ఇండియా నుంచి రాబోతున్న ‘కారెన్స్‌’ మోడల్‌కు ఆర్డర్లను తీసుకోవడం మొదలుపెట్టిన తొలి రోజే 7,738 బుకింగ్‌లు వచ్చాయి. జనవరి 14న ఈ మోడల్‌కు  రూ.25,000 ప్రాథమిక మొత్తంతో ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించారు. ‘బుకింగ్‌లు మొదలైన తొలి 24 గంటల్లోనే కారెన్స్‌కు భారీ స్పందన వచ్చింది. భారత్‌లో మా ఉత్పత్తుల్లో అత్యధిక తొలి రోజు బుకింగ్‌లను ఇది సాధించింద’ని కియా ఇండియా ఎండీ, సీఈఓ తాజ్‌-జిన్‌ పార్క్‌ పేర్కొన్నారు. అయిదు ట్రిమ్‌ లెవల్స్‌(ప్రీమియం, ప్రెస్టీజ్‌, ప్రెస్టీజ్‌ ప్లస్‌, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌)లలో వస్తున్న ఈ మోడల్‌లో పలు పవర్‌ట్రైన్‌, 6-7 సీట్ల అవకాశాలున్నాయి.


మాస్‌చిప్‌ ఆదాయం రూ.39.58 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌:  హైదరాబాద్‌కు చెందిన మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.39.58 కోట్ల ఆదాయాన్ని, రూ.1.73 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో రూ.27.78 కోట్ల ఆదాయంపై రూ.1.31 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి సంస్థ ఆదాయం రూ.114.80 కోట్లు, నికరలాభం రూ.4.68 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.77.02 కోట్లు, నికర నష్టం రూ.8.81 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ డైరెక్టర్‌ బోర్డు నుంచి జేఏ చౌదరి రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది.


టెక్‌ మహీంద్రా చేతికి కామ్‌ టెక్‌ కంపెనీ

దిల్లీ: ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా.. ఐరోపాకు చెందిన కామ్‌ టెక్‌ కంపెనీ ఐటీలో (సీటీసీ) 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ సంస్థతో పాటు మరో 2 ఇన్సూర్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో 25 శాతం వాటాల్ని కూడా కలిపి 33 కోట్ల యూరోలు (సుమారు రూ.2,800 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిపింది. తమ డిజిటల్‌ ఇంజినీరింగ్‌, బీమా సాంకేతికత వ్యాపారాల్ని బలోపేతం చేయడానికి ఈ కొనుగోళ్లు ఉపకరిస్తాయని టెక్‌ మహీంద్రా ప్రెసిడెంట్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ, హెచ్‌ఎల్‌ఎస్‌, కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌) వివేక్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 2010 ఏప్రిల్‌లో సంక్షోభంలో కూరుకుపోయిన సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత సంస్థకు రెండో అతిపెద్ద కొనుగోలు ఇదే కావడం విశేషం.  


యూఏఈలో రాంకీ ఎన్విరో  పారిశ్రామిక వ్యర్థాల యూనిట్‌
రస్‌-అల్‌-ఖైమా ప్రజా సేవల శాఖతో ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌:  రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ యూఏఈలోని రస్‌-అల్‌-ఖైమాలో ‘ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ సదుపాయాన్ని’ ఏర్పాటు చేయనుంది. దీనికోసం రాంకీ ఎన్విరో అనుబంధ సంస్థ అయిన రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ మిడిల్‌ఈస్ట్‌,  రస్‌-అల్‌-ఖైమా ప్రజా సేవల శాఖకు చెందిన వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశోధన కేంద్రం, టెస్టింగ్‌ ల్యాబ్‌తో సహా పారిశ్రామిక వ్యర్థాల సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని, మెడికల్‌ వ్యర్థాలను 1200 డిగ్రీల ఉష్ణోగ్రతలో శుద్ధి చేసే ఏర్పాట్లు ఇందులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్య దేశాల్లో తమ కార్యకలాపాలు విస్తరించడానికి ఈ సదుపాయం దోహదపడుతుందని రాంకీ ఎన్విరో జాయింట్‌ ఎండీ మసూద్‌ మల్లిక్‌ పేర్కొన్నారు.  


అంకురాలకు తోడ్పాటు
దరఖాస్తులు ఆహ్వానించిన ఫ్లిప్‌కార్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: వినూత్న ఆలోచనలు కలిగిన అంకురాలకు తోడ్పాటు అందించేందుకు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ‘లీప్‌ అహెడ్‌, లీప్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌’ పేరిట రెండు కార్యక్రమాలను ప్రారంభించింది. వివిధ దశల్లో ఉన్న అంకురాలను ఎంపిక  చేసి, వాటికి మెంటార్‌షిప్‌, పెట్టుబడుల సమీకరణ, వృద్ధికి అవసరమైన అంశాల్లో సహకారాన్ని అందిస్తుంది. కొత్తతరం అంకురాలకు తోడ్పాటు అందించేందుకే ఈ కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవి అయ్యర్‌ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ లీప్‌ అహెడ్‌లో ప్రాథమిక స్థాయిలో ఉన్న ఫిన్‌టెక్‌, పంపిణీ, లాజిస్టిక్స్‌, సాస్‌, బీ2బీ, హెల్త్‌టెక్‌, అగ్రిటెక్‌, ఎడ్యుటెక్‌ అంకురాలకు తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన సంస్థలకు రూ.కోటి నుంచి రూ.3.5 కోట్ల వరకు పెట్టుబడి సహాయం అందుతుందన్నారు. లీప్‌ ఇన్నోవేషన్‌లో డిజిటల్‌ కామర్స్‌, రిటైల్‌ టెక్‌ తదితర వాటికి తోడ్పాటు అందుతుందన్నారు. అంకురాలు ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.


డజను సీపీఎస్‌ఈల నుంచి ప్రభుత్వానికి రూ.6651 కోట్ల డివిడెండు

దిల్లీ: గెయిల్‌, ఎన్‌ఎమ్‌డీసీ, పవర్‌గ్రిడ్‌ సహా డజను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు) నుంచి డివిడెండు రూపేణా ప్రభుత్వం సోమవారంరూ.6651 కోట్లు అందుకుంది. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐఎల్‌) నుంచి రూ.972 కోట్లు, పవర్‌గ్రిడ్‌ నుంచి రూ.2506 కోట్లు లభించాయి. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (రూ.351 కోట్లు), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ (రూ.149 కోట్లు), హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ (రూ.19 కోట్లు), ఎఫ్‌ఏజీఎంఐఎల్‌ (రూ.12 కోట్లు), ఎన్‌ఎస్‌ఐసీ (రూ.31 కోట్లు) డివిడెండు ఇచ్చాయి. ఎన్‌ఎమ్‌డీసీ రూ.1605 కోట్లు, గెయిల్‌ రూ.913 కోట్లు, సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూ.42 కోట్లు, నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 26 కోట్లు, వాప్కోస్‌ రూ.25 కోట్లు చొప్పున డివిడెండు చెల్లించాయి. తాజా డివిడెండులతో 2021-22లో ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించిన మొత్తం రూ.40,000 కోట్లకు చేరువైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని