
ఇళ్ల ధరలు 30 శాతం వరకు పెరగొచ్చు
క్రెడాయ్ అంచనా
దిల్లీ: ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో, ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడే ఆస్కారం ఉందని క్రెడాయ్ అంచనా వేస్తోంది. అందువల్ల ఈ ఏడాది ఇళ్ల ధరలు 20-30 శాతం పెరగొచ్చని పేర్కొంది. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి సంఘాల సమాఖ్య (క్రెడాయ్) 2022 కోసం నిర్వహించిన ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే’లో ఈ విషయం తేలింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,322 మంది నిర్మాణదారులు పాల్గొన్నారు.
* ఇందులో దాదాపు 60శాతానికి పైగా సభ్యులు 2022లో దేశవ్యాప్తంగా స్థిరాస్తి ధరలు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 10-20 శాతం పెరగొచ్చని 35 శాతం మంది, 10 శాతం వరకు అధికం కావచ్చని 25 శాతం మంది, 20-30 శాతం వరకు పెరగొచ్చనే అంచనాను 21 శాతం మంది వ్యక్తం చేశారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
మూడో దశ కొవిడ్ ముప్పును అదుపు చేసేందుకు ప్రభుత్వం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడకుండా నియంత్రించాలని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ పటోడియా అన్నారు. కొవిడ్ నేపథ్యంలో భవన నిర్మాణదారులు కూడా డిజిటల్ బాటలో విక్రయాలు సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 39 శాతానికిపైగా డెవలపర్లు తమ అమ్మకాల్లో 25 శాతం వరకు ఆన్లైన్లో సాధిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఇది మరింత పెరగొచ్చని తెలిపారు. 92 శాతం డెవలపర్లు ఈ ఏడాది కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సులభతర వ్యాపార నిర్వహణ ఉండాలని 74 శాతం మంది కోరుకుంటున్నారు. 65 శాతం మంది కో-వర్కింగ్, కో-లివింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. అధికశాతం మంది నివాస గృహాల ప్రాజెక్టులవైపే మొగ్గు చూపిస్తున్నట్లు క్రెడాయ్ సర్వే వెల్లడించింది.
* నిర్మాణ సామగ్రి ధరల నియంత్రణ, జీఎస్టీ క్రెడిట్ ఇన్పుట్ను ప్రారంభించడం, నిధుల లభ్యత పెంచడం, ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వడం వంటివి పరిష్కరించాలని నివేదిక సూచించింది.