ఐవీఎఫ్‌కు జీఎస్‌టీ మినహాయింపుపై త్వరలో స్పష్టత

పునరుత్పత్తి సాంకేతికత (ఏఆర్‌టీ) లేదా ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) లాంటి వాటికి వర్తించే జీఎస్‌టీ రేట్లపై త్వరలోనే ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అతిథిగా విచ్చేసే యాంకర్లకు గౌరవవేతనం చెల్లింపుపైనా ఎంత జీఎస్‌టీ వర్తిస్తుందో తెలియజేయనుంది.

Published : 25 Jun 2022 03:16 IST

అతిథి యాంకర్ల గౌరవ వేతనానికి వర్తించే జీఎస్‌టీపై కూడా

దిల్లీ: పునరుత్పత్తి సాంకేతికత (ఏఆర్‌టీ) లేదా ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) లాంటి వాటికి వర్తించే జీఎస్‌టీ రేట్లపై త్వరలోనే ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అతిథిగా విచ్చేసే యాంకర్లకు గౌరవవేతనం చెల్లింపుపైనా ఎంత జీఎస్‌టీ వర్తిస్తుందో తెలియజేయనుంది. ఓ వైద్య సంస్థ, గుర్తింపు ఉన్న మెడికల్‌ ప్రాక్టీషనర్‌, పారా మెడిక్స్‌ అందించే ఆరోగ్య సంరక్షణ సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉందని.. ఏఆర్‌టీ/ ఐవీఎఫ్‌లకు జీఎస్‌టీ మినహాయింపుపై త్వరలోనే స్పష్టత ఇస్తామని జీఎస్‌టీ మండలికి కేంద్రం, రాష్ట్రాల పన్ను అధికారుల కమిటీ (ఫిట్‌మెంట్‌ కమిటీ) సమాచారం ఇచ్చింది. దేశంలోని గుర్తింపు పొందిన ఏదేని సంస్థ ద్వారా రోగ నిర్థారణ పరీక్షలు (డయాగ్నొసిస్‌) లేదా రోగం, గాయం, వైకల్యం, ప్రసవం లాంటి వాటికి అందించే వైద్య చికిత్సలను ఆరోగ్య సంరక్షణ సేవలుగా జీఎస్‌టీ చట్టం నిర్వచించింది. రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లడం, తిరిగి తీసుకుని రావడం కూడా ఈ సేవల కిందకు వస్తాయి. అయితే జుట్టు ట్రాన్స్‌ప్లాంట్‌ లేదా కాస్మొటిక్‌ లేదా ప్లాస్టిక్‌ సర్జరీలను ఆరోగ్య సంరక్షణ సేవలుగా పరిగణించరు. ఏఆర్‌టీ/ ఐవీఎఫ్‌ కూడా ఆరోగ్య సంరక్షణ సేవల నిర్వచనం కిందకు వచ్చినప్పటికీ.. జీఎస్‌టీ మినహాయింపుపై స్పష్టతను ఓ సర్క్యులర్‌ ద్వారా తెలియజేయనున్నట్లు ఫిట్‌మెంట్‌ కమిటీ తెలిపింది. ఈనెల 28-29 తేదీల్లో జరిగే సమావేశంలో జీఎస్‌టీ మండలి ముందు ఈ సిఫారసులను కమిటీ ఉంచే అవకాశం ఉంది. అతిథి యాంకర్లకు చెల్లించే గౌరవ వేతనంపైనా ఎంత జీఎస్‌టీ వర్తిస్తుందనే విషయంపైనా  కమిటీ స్పష్టత ఇవ్వనుంది. నెలవారీ రిటర్న్‌ జీఎస్‌టీఆర్‌-3బీలో మార్పులు చేసే అంశాన్ని కూడా వచ్చే వారంలో జరిగే సమావేశంలో జీఎస్‌టీ మండలి పరిశీలించనుంది. నకిలీ బిల్లుల నియంత్రణకు ఈ పరిణామం ఉపయోగపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని