వాయిదా ఆలస్యం...మోయలేని భారం!

సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారు మొదటగా ఆలోచించేది గృహరుణం గురించే. సొంత డబ్బు ఉన్నప్పటికీ, అవకాశం ఉన్నప్పుడు ఎంతోకొంత రుణం తీసుకునే ఇల్లు సొంతం చేసుకుంటారు. తక్కువ వడ్డీకి అప్పు దొరకడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఉండటమే దీనికి కారణం. గృహరుణం

Published : 18 Dec 2020 19:45 IST

సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారు మొదటగా ఆలోచించేది గృహరుణం గురించే. సొంత డబ్బు ఉన్నప్పటికీ, అవకాశం ఉన్నప్పుడు ఎంతోకొంత రుణం తీసుకునే ఇల్లు సొంతం చేసుకుంటారు. తక్కువ వడ్డీకి అప్పు దొరకడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఉండటమే దీనికి కారణం. గృహరుణం అంటే ఓ దీర్ఘకాలం కొనసాగే అప్పు. వాయిదాలను సక్రమంగా చెల్లించినప్పుడే ఇందులో తక్కువ వడ్డీ ప్రయోజనం మనకు అందుతుంది. లేదంటే రుసుముల రూపంలో భారీగానే చెల్లించుకోవాల్సి వస్తుంది.

నితిన్‌ రూ.10లక్షల ఇంటి రుణం 10.5% వడ్డీకి తీసున్నాడు. 20 ఏళ్ల వ్యవధి. నెలకు రూ.10వేలు చెల్లించాలి. ఒక నెల వాయిదా కట్టకపోతే 2శాతం అపరాధ రుసుము కట్టాలి. ఈ అపరాధ రుసుము వాయిదా మొత్తం మీద ఉంటుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో తీసుకున్న ఇంటి రుణం మీద అయితే ఇంటి అప్పు నిల్వ మొత్తం మీద విధిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అందుకే, ఇంటి రుణం తీసుకునేటప్పుడే, రుణ వాయిదా చెల్లింపు ఆలస్యం అయితే ఎంత అపరాధ రుసుమో అడగండి, ఆ రుసుము ఎలా లెక్కిస్తారో కూడా కనుక్కోండి. రుణ కాగితాలపై సంతకం పెట్టేటప్పుడే దీనికి సంబంధించిన నిబంధనలు మీ ఇంటి రుణ కాగితాల్లో ఎక్కడ రాసి ఉన్నాయో అడిగి, ఆ నిబంధనలు మీ కళ్ళతో చూడండి.

ఇంటి రుణ వాయిదా చెల్లింపు కోసం చెక్కు ఇవ్వడం, ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ విధానంలో చెల్లింపు/ స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తుంటాం. వాయిదా తేదీ నాటికి మన ఖాతాలో కనీస నిల్వ ఉండాలి. ఇలా లేకపోతే చెల్లింపు జరగదు. దీంతో బ్యాంకులు రూ.100 నుంచి రూ.250 రూపాయల వరకూ అపరాధ రుసుము విధిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకులో నెలలో ఒకసారి చెక్కు వాపసు వెళ్తే రూ.350 వరకూ అపరాధ రుసుము కట్టాలి. అదే నెలలో రెండోసారి చెక్కు వాపసు వెళ్తే రూ.750 రుసుము విధిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇంటి రుణానికి ఇచ్చిన చెక్కు/ఈసీఎస్‌ మూడు నెలల్లో (ఒక క్వార్టర్‌) మొదటిసారి చెల్లింపు జరగకపోతే రూ.350 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంకు వెబ్‌సైట్‌లో నిబంధనలు చెబుతున్నాయి.

వాయిదా చెల్లింపు తేదీ నాటికి ఖాతాలో తగిన నిల్వ ఉంచనందువల్లే రుణ వాయిదాకు ఇచ్చిన చెక్కు/ఈసీఎస్‌ వాపసు అవుతాయి. దీనికి సంబంధించిన అపరాధ రుసుములను మన ఖాతా నుంచి తగ్గించడం వల్ల, ఖాతాలో ఉండాల్సిన కనీస నిల్వ తగ్గిపోయే అవకాశం ఉంది. ఖాతాలో కనీస నిల్వ లేకపోతే కొన్ని జాతీయ బ్యాంకులు రూ.100- రూ.200ల రుసుమును విధిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌ వంటి కొన్ని బ్యాంకులు మాత్రమే తమ పొదుపు ఖాతాకు కనీస నిల్వ అవసరం లేదు అని చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకుల్లో కనీస నిల్వ లేనపుడు అపరాధ రుసుము నెల/మూడు నెలలకు రూ.250, రూ.350 వసూలు చేస్తున్నారు. పొదుపు ఖాతాలో కనీస నిల్వ మినహాయింపు ఇవ్వాలంటే ఇతర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండాలని మరికొన్ని బ్యాంకులు చెబుతున్నాయి. (వేతన ఖాతాల విషయంలో కనీస నిల్వ విషయంలో మినహాయింపు ఉంటుంది.)

ఇక నితిన్‌ ఒక నెల రూ.10వేల వాయిదా చెల్లించనందుకు రెండు శాతం రుసుము చొప్పున రూ.200 కట్టాలి. దీనికితోడు చెక్కు తిరిగి వెళ్లినందుకు రూ.350 చెల్లించాలి. అదే చెక్కు రెండోసారి కూడా బ్యాంకుకు వచ్చి, మళ్లీ తిరిగి వెళ్తే మరో రూ.750 కట్టాలి. వీటన్నింటికీ కనీస నిల్వ లేనందుకు అపరాధ రుసుము (రూ.350) తోడయితే 200+ 350+ 750+ 350… మొత్తం రూ.1650 సమర్పించుకోవాలి.

రుణంపై భారాన్ని ఎలా లెక్కించాలి?

మనం తీసుకున్న అప్పుపై నెలకు వడ్డీ 2శాతం అంటే అది పెద్ద భారంగా కనిపించదు. కానీ, మనం రుణంపై కట్టే వడ్డీని నెలవారీగా లెక్కించకూడదు. ఏడాదికి ఎంతో లెక్కించాలి. బ్యాంకు వడ్డీలన్నీ ఏడాదికి ఎంతో లెక్కిస్తాయి. ఉదాహరణకు మీ పక్క ఊరిలో ఉన్న స్నేహితుడు రూ.100 రుణానికి నెలకు ఒక రూపాయి వడ్డీ తీసుకుంటాడు. నెలకు ఒక రూపాయే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. నెలకు రూపాయి వడ్డీ అంటే ఏడాదికి రూ.12 అవుతుంది. మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి రూ.100 అప్పిస్తే నెలకు రూ.2 చొప్పున వడ్డీ తీసుకుంటాడు. అంటే ఏడాదికి రూ.24 వడ్డీ అన్నమాట. అసలు భారం తెలియాలంటే తక్కువగా కనిపించే నెల వడ్డీ శాతాన్ని ఏడాదికి ఎంత శాతం అవుతుందో లెక్కలోకి తీసుకోవాలి.

బ్యాంకులు, రుణ సంస్థలు వడ్డీని ఏడాదికి ఎంతో చెబుతుంటాయి. అయితే, అపరాధ రుసుములు భారీగా కనిపించకూడదని ఒక నెల వాయిదా కట్టకపోతే ఆ నెలకు విధించే రుసుము ఎంతో చెబుతారు కానీ, ఏడాదికి 24% చొప్పున నెలకు 2% రుసుము అని చెప్పవు. అలా చెప్తే అప్పు తీసుకున్న వ్యక్తి ఆందోళన చెంది, గొడవ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నెలకింత, ఒకసారి నిబంధన పాటించకపోతే రుసుము ఇంత అని చెబుతుంటాయి. అయితే వినియోగదారుగా మన భారాన్ని లెక్కించాలంటే వడ్డీని లెక్కించినట్లే ఏడాదికి లెక్కిస్తే మంచిది. ఎందుకంటే ఒకసారి ఆలస్యం అయితే పర్వాలేదు. అలవాటుగా ఆలస్యం అయితే ఏడాదికి ఆ భారం మనం కట్టినట్లవుతుంది.

రూ.100 అప్పు వాయిదాకు నెలకు రూ.2 పెనాల్టీ అంటే పెద్ద భారం అనిపించదు. కానీ రూ.100 వాయిదాకు ఒక నెల ఆలస్యానికి రూ.2 పెనాల్టీ అంటే ఏడాదికి 24% చొప్పున అన్నమాట. ఈ ప్రకారంగా పదివేల రూపాయల వాయిదాకు ఒక నెలకు రూ.1650 పెనాల్టీ. అంటే… ఏడాది చొప్పున లెక్కిస్తే ఇది ఏడాదికి 198% చొప్పున చెల్లించినట్లు (ఒక నెల పెనాల్టీ = 10,000×198%×1/12).

ఈ పెనాల్టీలకు ఆదాయపు పన్ను రాయితీలు ఏవీ రావు. అందుకే, ఇంటి రుణం తీసుకునేటప్పుడే… మున్ముందు ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు చెల్లింపులు ఆలస్యం కాకుండా… రుణ వాయిదాకు ప్రతి నెలా కాస్త ఎక్కువ కట్టడం మంచిది. లేదా, రెండు, మూడు నెలల వాయిదా మొత్తాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టడం అయినా అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని