BPCL: పరిస్థితిని సమీక్షించి బీపీసీఎల్‌ విక్రయంపై నిర్ణయం: ప్రభుత్వం

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి భారత పెట్రోలియం కార్పొరేషన్‌ (BPCL) వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది...

Published : 08 Aug 2022 21:53 IST

దిల్లీ: భారత పెట్రోలియం కార్పొరేషన్‌ (BPCL)లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కొవిడ్‌ సంక్షోభం, భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, ప్రపంచం స్వచ్ఛ ఇంధనం వైపు ప్రాధాన్యం పెరుగుతున్నందున.. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ముఖ్యంగా చమురు కంపెనీలు ప్రభావితమైనట్లు కరాడ్‌ గుర్తు చేశారు. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని తొలుత భావించింది. 2020లో బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వం అంచనా వేసినట్లుగా రష్యా దిగ్గజం రోజ్‌నెఫ్ట్‌ కానీ.. సౌదీ ఆరామ్‌కో కానీ ఆసక్తి ప్రదర్శించలేదు. వచ్చిన ముగ్గురు బిడ్డర్లలో ఇద్దరు వివిధ కారణాల మూలంగా వెనక్కి తగ్గారు. దీంతో ప్రభుత్వం ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అధిక ధరలు, ఆర్థిక మాంద్యం భయాలతో చమురు రంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పట్లో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటాల విక్రయ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని