Credit Cards: ఆగస్టులో గణనీయంగా తగ్గిన క్రెడిట్‌ కార్డుల సంఖ్య.. కారణమిదే!

ఆగస్టులో క్రియాశీల క్రెడిట్‌ కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి....

Updated : 28 Sep 2022 21:03 IST

హైదరాబాద్‌: ఆగస్టులో క్రియాశీల క్రెడిట్‌ కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. జులైలో 8 కోట్లుగా ఉన్న కార్డుల సంఖ్య ఆగస్టు ముగిసే నాటికి 2.8 శాతం తగ్గి 7.79 కోట్లకు చేరింది. ఏడాది, అంతకంటే కంటే ఎక్కువ కాలం వినియోగంలోలేని కార్డులను డియాక్టివేట్‌ చేయాలన్న ఆర్‌బీఐ ఆదేశాల కారణంగానే కార్డుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

గత కొన్ని నెలలుగా ప్రతినెలా దాదాపు 10-15 లక్షల కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ అవుతున్నాయి. ఆగస్టులో మాత్రమే ఒకేసారి 23 లక్షలు తగ్గాయి. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల్లో తగ్గుదల నమోదైంది. ఆగస్టులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులు 8.47 శాతం తగ్గి 1.64 కోట్లకు పడిపోయాయి. అదే సమయంలో యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులు 10.6 శాతం పడిపోయి 88 లక్షలకు తగ్గాయి. ఆర్‌బీఐ ఆదేశాలకనుగుణంగా 2022 ఆగస్టు నాటికి ఏడాదికి పైగా వినియోగంలోలేని కార్డులను జారీ సంస్థలు డియాక్టివేట్‌ చేశాయి.

మరోవైపు నెలప్రాతిపదికన క్రెడిట్‌ కార్డు వ్యయాలు ఆగస్టులో 3 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే మాత్రం 45 శాతం ఎగబాకి రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ వ్యయం జులైలో 6.5 శాతం వృద్ధి చెంది రూ.1.16 లక్షల కోట్లతో రికార్డు గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. పండగ సీజన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో క్రెడిట్‌ కార్డు వ్యయాలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే క్రెడిట్‌ కార్డుల ఆధారంగా అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని