Russia Ukraine war: ప్రపంచం గుండెలపై రష్యా కుంపటి..!

యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొన్ని కీలక మార్పులను పరిశీలిద్దాం....

Updated : 16 May 2022 12:36 IST

మాస్కో పెట్టిన మంటతో భగభగలాడుతున్న ధరలు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి ద్రవ్యోల్బణాన్ని ఎగదోశాయి. కొన్ని దేశాల్లో దుకాణాలకు వెళితే కనీసం వంట నూనె దొరకడం లేదు. మరికొన్ని దేశాల్లో పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ స్టేషన్లలో భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో రైతులు ఎరువుల కొరతతో సతమతమవుతున్నారు. ఇక కొన్ని దేశాలైతే ఏకంగా తమ విదేశాంగ విధానాల్లోనే మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. తమ భాగస్వామ్య, మిత్ర దేశాల జాబితాలను సవరించేందుకు సిద్ధమవుతున్నాయి. కొత్త వ్యాపారభాగస్వాములను వెతుక్కొని.. పొత్తులకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొన్ని కీలక మార్పులను పరిశీలిద్దాం..


ఆహారం సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ కుదేలు

ప్రపంచ దేశాలకు గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, వంటనూనెలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్‌, రష్యా ప్రధానమైనవి. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు భారీ ఎత్తున ఆహారోత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల్లో రష్యా ప్రధాన ఎగుమతిదారు. వీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయా దేశాల్లో ధరలు భారీగా పెరిగాయి. కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం తెరపైకి వస్తోంది.

* లెబనాన్‌లో సన్‌ఫ్లవర్‌ నూనె ధరలు 83% ఎగబాకాయి. గోధుమల ధరలు 47 శాతం పెరిగాయి. మొత్తంగా ఆ దేశంలో ఆహార పదార్థాలపై చేస్తున్న ఖర్చు మూడింతలు పెరిగినట్లు అంచనా.

* గోధుమల ఉత్పత్తిలో భారత్‌ రెండో అతిపెద్ద దేశం. దీంతో ప్రపంచ దేశాలు రష్యా, ఉక్రెయిన్‌ మూలంగా తలెత్తిన ఇబ్బందులను ఇక్కడి నుంచి పూడ్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో ఆర్డర్లు పెద్దఎత్తున పెరిగి ఎగుమతులు ఎగబాకాయి. అడ్డగోలు ఎగుమతులు భారత్‌లోనూ కొరతకు దారితీయొచ్చన్న ఆందోళన మొదలైంది. దీంతో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది.

* బ్రెజిల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ ఎరువుల దిగుమతిదారు. ఆ దేశ అవసరాల్లో ఐదో వంతు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం కారణంగా సరఫరా దెబ్బతిని ధరలు ఆకాశాన్నంటాయి.


వలస పక్షులై..

ఇప్పటి వరకు 58 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద శరణార్థుల సంక్షోభమని ఐరాస తెలిపింది. మరోవైపు ఇప్పటికే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా శరణార్థ సహాయ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. తాజాగా ఇది వచ్చి పడటంతో ఐరాస ప్రపంచ దేశాలను ఆర్థిక సాయం కోసం అర్థిస్తోంది.

* రొమేనియా ఇప్పటి వరకు 8.8 లక్షల మంది ఉక్రెయిన్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే.

* పోలండ్‌కు దాదాపు 32 లక్షల మంది చేరుకున్నారు. ఇది ఆ దేశ రాజదాని వార్సా జనాభాకు రెండింతలు. శరణార్థుల పిల్లల చదువు కోసం స్కూళ్ల సామర్థ్యాన్ని పెంచింది.


కొత్త సమీకరణాలు..

అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా ఉన్న రష్యా ప్రారంభించిన ఈ యుద్ధం ప్రపంచ గమనాన్నే మార్చేస్తోంది. వివిధ దేశాలు తమ విధానాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాల్లో మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య, అమెరికా సహా ఇతర దేశాలు కొత్త పంథాను అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి.

* రష్యాతో బంధాన్ని చైనా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. మరోవైపు పాశ్చాత్య దేశాల ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా.. చైనాకు ఎగుమతులను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇరు దేశాల బంధంపై పాశ్చాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. బీజింగ్‌ మాత్రం పెద్దగా ఖాతరు చేయకపోవడం గమనార్హం.

* భారత్‌ సైతం తమ అవసరాల నిమిత్తం రష్యాతో మైత్రిని ముందుకు సాగించేందుకు సిద్ధమైంది. రష్యావ్యతిరేక కూటమిలో చేరేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా చమురు దిగుమతి విషయంలో భారత్‌ తమ అవసరాల్ని వివరించి ప్రపంచ దేశాలను ఒప్పంచగలిగింది.

* ఇరాన్‌తో అణు ఒప్పందం దిశగా చర్యల్ని అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనా, జర్మనీ వేగవంతం చేశాయి.


ఇంధనం మరింత బరువై..

రష్యా సహజవాయువు ఉత్పత్తిలో రెండో స్థానంలో.. ముడి చమురు ఉత్పత్తిలో మూడో స్థానంలో నిలుస్తోంది. ఐరోపా సమాఖ్య దేశాలు చమురు, గ్యాస్‌ కోసం రష్యాపై ఆధారపడుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలపై  దృష్టి సారిస్తున్నాయి.

* అల్జీరియా, ఈజిప్టు, ఆఫ్రికా దేశాలతో సహజవాయువు దిగుమతి కోసం ఇటలీ చర్చలు జరపుతోంది.

* దశలవారీగా రష్యా చమురు, సహజవాయువు దిగుమతులను తగ్గించుకుంటామని బ్రిటన్‌ ప్రకటించింది.


భద్రతకు భారీ బడ్జెట్లు

ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలున్న దేశం రష్యా. ఉక్రెయిన్‌పై ఇది దాడికి దిగడంతో నాటో అప్రమత్తమైంది. ఈ కూటమిలోని చాలా దేశాలు తమ సైనిక వ్యవస్థ పటిష్ఠతకు భారీగా నిధులను కేటాయిస్తున్నాయి. కొత్త దేశాలను చేర్చుకోవడంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

* తమని నాటోలో చేర్చుకోవాలని ఫిన్లాండ్‌ కోరింది. దీన్ని వ్యతిరేకిస్తున్న రష్యా.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది.

* జర్మనీ, పోలండ్‌ తమ సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ రంగ బడ్జెట్లను పెంచాయి. ఆస్ట్రేలియా సైతం మరింత అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.


* కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం పెద్ద అడ్డంకిగా మారిందని ఐఎంఎఫ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరుతోందని తెలిపింది. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 2022-23కి గానూ 3.6 శాతానికి కుదించింది.

యుద్ధం ప్రారంభమైన తర్వాత కొన్ని కీలక అంశాల్లో భారత పరిస్థితి..

* ద్రవ్యోల్బణం గత రెండు నెలల్లో ఆర్బీఐ లక్షిత పరిధి అయిన 4-6% దాటి ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరింది.

* అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఎగబాకడంతో మార్చి-ఏప్రిల్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.10కు పైగా పెరిగాయి.

* ద్రవ్యోల్బణం ఎగబాకడంతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరిగి నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు సైతం భారీ కుంగుబాటును చవిచూస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు