Traffic rules: వావానదారులకు అలెర్ట్‌.. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే బీమా వర్తించదు!

ఏప్రిల్ 1, 2022 నుంచి ఈ కొత్త నిబంధనలను బీమా కంపెనీలు, రవాణా శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.

Updated : 22 Apr 2022 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రమాదాలకు దారితీసే ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీ జరిమానా విధించడమే కాకుండా, కోర్టు ఆదేశాల మేరకు బీమా క్లెయిమ్‌ల నిబంధనలను కూడా మార్చారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలను బీమా కంపెనీలు, రవాణా శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. వాహనదారులు చేసే కొన్ని రకాల పొరపాట్లు వారిని బీమా ప్రయోజనాలను దూరం చేస్తాయి. అవేంటో చూద్దాం..

  • ఆటో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య నిబంధనలకు మించి ఉండి, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే అలాంటి వారికి బీమా సదుపాయం వర్తించదు. అలాగే, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపి ప్రమాదానికి గురైనా బీమా లభించదు.
  • రాంగ్‌రూట్లో వాహనాలు నడిపే వారికి కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించరు. ఒకవేళ సరైన రూట్‌లో వాహనాలు నడుపుతున్న వారి కారణంగా రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారికి ప్రమాదం జరిగినా వారిపై ఎలాంటి కేసూ నమోదు చేయరు. పైగా రాంగ్‌ రూట్‌లో వెళ్లేవారి వల్ల ప్రమాదం జరిగితే ₹20 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారి ఆస్తులను విక్రయించడం ద్వారా కూడా డబ్బు రికవరీ అవ్వకపోతే వారికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
  • మద్యం తాగి వాహనాలు నడిపే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం వర్తించదు. వారికి బీమా సంస్థలు పరిహారాన్ని చెల్లించవు. మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణం అయిన వారికి కూడా పైన తెలిపిన ఉల్లంఘన నియమాలు వర్తిస్తాయి. ఇలాంటి వారు ఒకవేళ హెల్మెట్ ధరించినా, సరైన రూట్లో డ్రైవింగ్ చేసినా కూడా అదే శిక్ష వర్తిస్తుంది.
  • స్పీడ్ లిమిట్‌ను మించి వేగంగా వాహనాలు నడిపే వారికి కూడా అన్ని శిక్షలూ వర్తిస్తాయి. సీటు బెల్ట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా పరిహారం చెల్లించరు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని