Banking: బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను పిల్లలకు ప‌రిచ‌యం చేయండి..

పిల్లల చేతికి పాకెట్ మనీ ఇచ్చే బదులు.. బ్యాంకు ఖాతా తెరవడం వల్ల ఖాతాలో డబ్బు డిపాజిట్/విత్డ్రా చేయడం, ఖాతాను ట్రాక్ చేయడం, ఆన్లైన్ లావాదేవీలను నేర్చుకోవడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.

Published : 14 May 2022 16:44 IST

 
చిన్నతనం నుంచే పిల్లలకు ఆర్థిక నిర్వహణ నేర్పిస్తున్నారు చాలా మంది త‌ల్లిదండ్రులు. ఇది అవ‌స‌రం కూడానూ. అయితే చాలా మంది పిల్ల‌ల‌కు పాకెట్ మ‌నీ ఇచ్చి అందులో వారి ఖ‌ర్చుల‌ను మ్యానేజ్ చేసుకుని మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయ‌మ‌ని చెబుతున్నారు. త‌ద్వారా పిల్ల‌లు వారి ఖ‌ర్చు చేసే విధానాన్ని తెలుసుకోవ‌డంతో పాటు పొద‌పు నేర్చుకుంటార‌నేది త‌ల్లిదండ్రుల ఉద్దేశ్యం. ఇదే పని వారు బ్యాంక్ ఖాతా ద్వారా కూడా చేయవచ్చు. 

మైన‌ర్ ఖాతాతోనే బ్యాంకింగ్‌ను ప‌రిచయం చేయండి..
ప్ర‌స్తుతం బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీల‌ను నిర్వహించ‌డం దాదాపు అసాధ్యం. అందువ‌ల్ల పిల్ల‌లకు బ్యాంకు లావాదేవీల గురించి కొంతైనా ప‌రిజ్ఞానం ఉండ‌డం అవ‌స‌రం. డిపాజిట్, విత్‌డ్రా వంటి ప్రాథ‌మిక అంశాలు గురించి తెలియ‌జేయాలి. ఈ అంశాల‌ను మైన‌ర్ ఖాతాతోనే మీ పిల్ల‌ల‌కు ప‌రిచ‌యం చేయండి. పిల్ల‌ల‌కు మీరిచ్చే పాకెట్ మ‌నీ ఒక బ్యాంకు ఖాతా ద్వారా ఇవ్వండి. దీంతో మీ పిల్లలు పొదుపుతో పాటు ఆర్థిక లావాదేవీల నిర్వహణను ఆచరణాత్మకంగా(ప్రాక్టికల్గా) నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు చాలా బ్యాంకులు మైనర్ల పేరుతో ఖాతాను తెరిచేందుకు వీలుకల్పిస్తున్నాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను మైనర్లు అంటారు. వీరి కోసం తెరిచే బ్యాంకు ఖాతాలను మైనర్ ఖాతాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు తల్లిదండ్రలతో కలిసి, 10 ఏళ్లు పైబడిన పిల్లలు స్వాతంత్ర్యంగా బ్యాంక్ ఖాతను నిర్వహించవచ్చు.  

భ‌విష్య‌త్తు ఆర్థిక నిర్వ‌హ‌ణ స‌జావుగా సాగ‌డం కోసం..
పిల్లల చేతికి పాకెట్ మనీ ఇచ్చే బదులు.. బ్యాంకు ఖాతా తెరవడం వల్ల ఖాతాలో డబ్బు డిపాజిట్/విత్డ్రా చేయడం, ఖాతాను ట్రాక్ చేయడం, ఆన్లైన్ లావాదేవీలను నేర్చుకోవడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. పిల్లలు వారికి బహుమతిగా వచ్చిన డబ్బును పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కూడా సాధ్యం అవుతుంది. తమ వద్ద ఉన్న డబ్బును వేరు వేరు అవసరాలకు ఏ విధంగా కేటాయించాలో నిర్ణయించుకోగలుగుతారు. ఏ ఆప్షన్లను ఎంచుకుంటే లాభం ఉంటుందో అంచనా వేయగలుగుతారు. చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తం ఎలా సమకూర్చుకోవచ్చో తెలుస్తుంది. ఈ అభ్యాసాలు భవిష్యత్తు ఆర్థిక నిర్వహణలో పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

పిల్లల బ్యాంక్ ఖాతా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందా?
పిల్లలు ఒక మెచ్యూరిటి స్థాయికి చేరుకునే వరకు బ్యాంకు ఖాతా నిర్వహణ  తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటుంది కాబట్టి లావాదేవీలు నియంత్రణలో ఉంటాయి. అలాగే డిపాజిట్ మొత్తం కూడా పరిమితంగానే ఉంటుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఇతరులతో చేసే లావాదేవీలు చెల్లవు. పిల్లలు స్వంతంగా థర్డ్ పార్టీ లావీదేవీలను చేయలేరు. అలాగే బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం వరకే డబ్బును విత్డ్రా చేయగలరు. ఓవర్‌డ్రా చేసేందుకు గానీ, రుణం తీసుకునేందుకు గానీ బ్యాంకులు అనుమతించవు. పిల్లలు చేసే పత్రీ లావాదేవీకి సంబంధించిన మెసేజ్ అల‌ర్ట్ తల్లిదండ్రుల మొబైల్‌కి వ‌చ్చేలా సెట్ చేసుకోవచ్చు. దీంతో పిల్లలు ఏదైనా లావాదేవీ చేసిన వెంటనే పెద్దలకు తెలుస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు