IRCTC BOB నుంచి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌.. టికెట్‌ బుకింగ్‌పై రివార్డ్‌ పాయింట్స్‌!

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అనుబంధ సంస్థ)తో కలిసి ఐఆర్‌సీటీసీ ఓ కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది.

Published : 21 Feb 2022 21:29 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అనుబంధ సంస్థ)తో కలిసి ఐఆర్‌సీటీసీ ఓ కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. టికెట్‌ బుకింగ్‌పై ఆఫర్లను ఇచ్చేందుకు కో బ్రాండెడ్‌ రూపే క్రెడిట్‌ కార్డును విడుదల చేసింది. ఈ కార్డు ద్వారా తరచూ ప్రయాణాలు చేసేవారు కొంతమేర టికెట్‌ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ క్రెడిట్‌ కార్డును కేవలం రైలు టికెట్ల బుకింగ్‌ మాత్రమే కాకుండడా పెట్రోల్‌, సరకుల కొనుగోలుకు సైతం వినియోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ఉపయోగించి చేసే టికెట్ల బుకింగ్స్‌పై గరిష్ఠంగా 40 రివార్డు పాయింట్లు పొందొచ్చు. అలాగే, ప్రతి టికెట్‌ బుకింగ్‌పైనా ఒక శాతం ట్రాన్జక్షన్‌ ఫీజు రాయితీ పొందొచ్చు. కార్డు జారీ అయిన 45 రోజుల్లో వెయ్యి రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి లావాదేవీ జరిపితే 1000 బోనస్‌ పాయింట్లు ఇవ్వనున్నారు.

అలాగే, సరకుల కొనుగోలు విషయంలో ప్రతి వంద రూపాయలకు 4 రివార్డు పాయింట్లు, ఇతర కొనుగోళ్లపై 2 రివార్డు పాయింట్లు చొప్పున పొందొచ్చు. అలాగే, పార్టనర్‌ రైల్వే లాంజ్‌లు ఏడాదికి నాలుగు సార్లు కాంప్లిమెంటరీ విజిట్స్‌కు అనుమతిస్తారు. పెట్రోల్‌ పంపుల వద్ద 1 శాతం ఫ్యూయల్‌ సర్‌ఛార్జీ రాయితీ ఇవ్వనున్నారు. ఇలా వచ్చిన రివార్డు పాయింట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా రిడీమ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ లాగిన్‌ ఐడీకి తమ కార్డును అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వేదికగా రోజుకు 7-7.5 లక్షల టికెట్లు బుక్‌ అవుతుంటాయి. కార్డు విడుదల కార్యక్రమంలో ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణ్‌రాయ్‌, ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజినీ హసిజా, బీఎఫ్‌ఎస్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో శైలేంద్ర సింగ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని