Jeff Bezos: 1.2 కోట్ల అమెజాన్‌ షేర్లను విక్రయించిన బెజోస్‌

Jeff Bezos: 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు బెజోస్‌ గత ఏడాది ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా 1.2 కోట్ల షేర్లను అమ్మారు.

Published : 11 Feb 2024 15:33 IST

వాషింగ్టన్‌: బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) 1.2 కోట్ల అమెజాన్‌ షేర్లను (Amazon shares) విక్రయించారు. వీటి విలువ దాదాపు రెండు బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే వెల్లడించారు.

తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో అమ్మేసినట్లు బెజోస్‌ (Jeff Bezos) వెల్లడించారు. 169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్‌ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్‌ను విక్రయించినా.. ఇంకా ఆయనకు 11.8 శాతం వాటా ఉంటుందని అంచనా. 

తన నివాసాన్ని సియాటెల్‌ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్‌లో బెజోస్‌ (Jeff Bezos) వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్‌లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్‌ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా. పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్‌ డాలర్ల ‘బెజోస్‌ ఎర్త్‌ ఫండ్‌’ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్‌ డాలర్ల ‘బెజోస్‌ డే వన్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని