Jio 5G: మరో 27 సిటీల్లో జియో 5జీ సేవలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పట్టణాల్లోనే..

జియో 5జీ సేవలను మరో 27నగరాలకు విస్తరించినట్లు రిలయన్స్‌ సంస్థ వెల్లడించింది. హోలీ పర్వదినం సందర్భంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల జాబితాలో తెలంగాణలోనే అత్యధికం ఉండటం విశేషం. 

Updated : 08 Mar 2023 20:26 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) తన 5జీ సేవల్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవల్ని(Jio 5G services) అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. తాజాగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మరో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 331 నగరాలు/పట్టణాల్లో 5జీ సేవలను తీసుకొచ్చినట్లు టెలికం దిగ్గజం వెల్లడించింది. తాజాగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన పట్టణాల జాబితా తెలంగాణలోనే అత్యధికం ఉండటం విశేషం. 

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌లోని అదనంగా మరో 27 నగరాల్లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జియో తెలిపింది.  కొత్తగా సేవలు ప్రారంభించిన  ఆయా నగరాలు/పట్టణా జాబితాలో ఏపీలో తాడిపత్రి, తెలంగాణలోని జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్‌ ఉన్నాయి. అలాగే, భాటపర (ఛత్తీస్‌గఢ్‌), అనంత్‌నాగ్‌ (జమ్మూకశ్మీర్‌), కర్ణాటకలోని భద్రావతి, దొడ్డబళ్లాపూర్‌, చింతామణి, రామనగర; కేరళలోని చంగరస్సీ, కొడుంగల్లూర్‌, మువతుపుళ ఉండగా..కకాట్ని ముర్వారా (మధ్యప్రదేశ్‌), సతారా (మహారాష్ట్ర), పఠాన్‌కోఠ్‌ (పంజాబ్‌), కోవిల్‌పట్టి, పొల్లాచి (తమిళనాడు; రాంపూర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌); కాశీపూర్‌, రామ్‌నగర్‌ (ఉత్తరాఖండ్‌), బంకురా (పశ్చిమబెంగాల్) ఉన్నాయి. ఆయా నగరాల పరిధిలోని వినియోగదారులు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జీబీపీఎస్‌ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటాను వాడుకోవచ్చని పేర్కొంది.  2023 నాటికల్లా దేశవ్యాప్తంగా జియో 5జీ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  జియో ట్రూ 5జీ టెక్నాలజీ ప్రయోజనాలను ప్రతి వినియోగదారుడికీ అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి ఈ సేవలు ప్రతి పట్టణం/నగరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నది ఈ నగరాలు/పట్టణాల్లోనే.. 

జియో అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అనకాపల్లి, మచిలీపట్నం, అనంతపురం, భీమవరం, చీరాల చిత్తూరు, ఏలూరు, గుంతకల్‌, గుంటూరు, హిందూపూర్‌, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, నంద్యాల్‌, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తెనాలి, తిరుమల, తిరుపతి, విజయవాడ, విజయనగరంలలో జియో 5జీ సర్వీసులు ఉన్నాయి. తాజాగా తాడిపత్రిలో సర్వీసులు మొదలైనట్టు ఆ సంస్థ ఈరోజు ప్రకటించింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు హైదరాబాద్‌, ఆదిలాబాద్‌,  కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండం, వరంగల్‌ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా హోలీ సందర్భంగా  రాష్ట్రంలో మరో 8 పట్టణాలకు (జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్‌)  ఈ సేవల్ని విస్తరించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని