Mahindra: లీజుకు మహీంద్రా వాహనాలు.. క్విక్లీజ్‌తో జట్టు

వాహనాలను లీజ్‌కు ఇచ్చే పద్ధతికి ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఆటోమోటివ్‌ (Mahindra Automotive) శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వాహన లీజింగ్‌ వేదిక క్విక్లీజ్‌ (Quiklyz)తో జట్టుకట్టింది.

Published : 16 Feb 2022 18:57 IST

ముంబయి: వాహనాలను లీజ్‌కు ఇచ్చే పద్ధతికి ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఆటోమోటివ్‌ (Mahindra Automotive) శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వాహన లీజింగ్‌ వేదిక క్విక్లీజ్‌ (Quiklyz)తో జట్టుకట్టింది. దీని ద్వారా మహీంద్రా వాహనాలను ఎలాంటి అవాంతరాలూ లేకుండా లీజుకు తీసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఆటో పోర్టల్‌ ద్వారా గానీ, కంపెనీ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ దగ్గర గానీ ఈ సేవలు పొందొచ్చని పేర్కొంది. ముంబయి, పుణె, దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ‘పే పర్‌ యూజ్‌’ పద్ధతిని తీసుకొచ్చినట్లు మహీంద్రా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విజయ్‌ నక్రా తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకుని నిర్ణీత కాలం తర్వాత వెనక్కి ఇచ్చేయొచ్చని, లేదంటే కొత్త కారుకు అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చని తెలిపారు. దేశంలో విస్తరిస్తున్న కారు లీజు మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి క్విక్లీజ్‌తో ఒప్పందం ఉపయోగపడుతుందని నక్రా తెలిపారు. నెలకు రూ.21వేల నుంచి లీజ్‌ ప్రారంభమవుతుందని, ఇన్సూరెన్స్‌, మెయింటెయినెన్స్‌, రోడ్‌ సైట్‌ అసిస్టెన్స్‌ వంటివి ఇందులో కలిసి ఉంటాయన్నారు. ఎలాంటి డౌన్‌ పేమెంట్‌చేయాల్సిన అవసరం లేదని,  24 నెలల నుంచి 60 నెలల వరకు కాలపరిమితిని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.

వాహనం పొందేందుకు లీజింగ్‌, సబ్‌స్క్రిప్షన్‌ అనేవి కొత్త సాధనాలుగా మారుతున్నాయని క్విక్లీజ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బిజినెస్‌ హెడ్‌ తుర్రా మహమ్మద్‌ తెలిపారు. రాబోయే 5-10 ఏళ్లలో ఈ పరిశ్రమ 15-20 నుంచి శాతం మేర వార్షిక వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. తమ డిజిటల్‌ వేదిక ద్వారా మహీంద్రా నుంచి ప్రముఖ శ్రేణి ఎస్‌యూవీలను అందించేందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని