IPOకు మామాఎర్త్‌ మాతృ సంస్థ.. షేర్లు విక్రయించనున్న శిల్పాశెట్టి

Honasa Consumer files IPO papers: మామాఎర్త్‌ మాతృ సంస్థ హొనాసా కన్జూమర్‌ ఐపీఓకు రానుంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది.

Published : 29 Dec 2022 20:23 IST

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లు అయిన మామాఎర్త్ (Mamaearth)‌, ది డెర్మా కో (The Derma Co) వంటి సంస్థలకు మాతృ సంస్థ అయిన హోనాసా కన్జూమర్‌ (Honasa Consumer) ఐపీఓకు రానుంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను జారీ చేయనున్నారు. దీంతో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన చెందిన 4,68,19,635 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనున్నారు.

కంపెనీ ప్రమోటర్లు అయినా వరుణ్‌ అలాఘ్‌, గజల్‌ అలాఘ్‌తో పాటు, ఇన్వెస్టర్లు ఫైర్‌సైడ్‌ వెంచర్స్‌ ఫండ్‌, సోఫీనా, స్టెల్లరీస్‌, కునాల్‌ బన్సల్‌, రోహిత్‌ బన్సల్‌, మారికో ఎఫ్‌ఎంసీజీ సంస్థకు చెందిన రిషభ్‌ హర్ష్‌ మారివాల్‌తో పాటు బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తమ షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓలో 10 కోట్ల విలువైన షేర్లను అర్హులైన ఉద్యోగులకు రిజర్వ్‌ చేయనున్నారు.

ఐపీఓ కంటే ముందే ప్రీ ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.80 కోట్లు కంపెనీ సమీకరించే అవకాశం ఉన్నట్లు ముసాయిదా పత్రాల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే ఆ మేర ఫ్రెష్‌ ఐపీఓ సైజ్‌ తగ్గనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని ప్రకటనలు, బ్రాండ్‌ ఔట్‌లెట్ల ఏర్పాటు, అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో హొనాసా కన్జూమర్‌ తెలిపింది.

కంపెనీ గురించి

గురుగ్రామ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని వరుణ్‌, గజల్‌ అలాఘ్‌ దంపతులు 2016లో నెలకొల్పారు. మామాఎర్త్‌తో తొలుత తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత ది డెర్మా కో, అక్వాలాజికా, అక్వా, బీబ్లంట్‌, డాక్టర్‌ సేత్స్‌ వంటి మరో ఐదు కంపెనీలను స్థాపించారు. 2022 జనవరిలో హొనాసా కన్జూమర్‌ యూనికార్న్‌ క్లబ్‌లోకి సైతం అడుగుపెట్టింది. ఈ ఐపీఓకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, జేఎం ఫైనాన్షియల్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈలో ఈక్విటీ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని