Boeing 737-9 Max: ఆ విమానం మోడల్‌ అంబానీకీ ఉంది!

Boeing 737-9 Max: అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి బయలుదేరిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి గగనతలంలో తలుపు ఊడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఫెడరల్‌ అధికారులు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తక్షణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Published : 08 Jan 2024 16:43 IST

వాషింగ్టన్‌: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కూ బోయింగ్‌ 737-9 మ్యాక్స్‌ (Boeing 737-9 Max) విమానం ఉంది. ఈ విమానాల భద్రతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా గగనతలంలో తలుపు ఊడినప్పటికీ.. పెనుప్రమాదం నుంచి తప్పించుకున్న అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానం ఈ మోడల్‌కు చెందినదే.

బోయింగ్‌ 737-9 మ్యాక్స్‌ (Boeing 737-9 Max) మోడల్‌ ఉన్న ఏకైక కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ మాత్రమేనని విమానయాన సమాచార నిర్వహణ సంస్థ సిరియం ద్వారా తెలుస్తోంది. గత ఏడాదిలోనే కంపెనీ దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టీ7-లోటస్‌ పేరిట దీన్ని రిజిస్టర్‌ చేయించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు రిలయన్స్‌ వద్ద రెండు ఎంబ్రార్‌ ఎస్‌ఏ ఈఆర్‌జే 145, ఎయిర్‌బస్‌ ఏ319 విమానాలు; రెండు హెలికాప్టర్లు ఉన్నాయి.

తలుపు ఊడిన ఘటన నేపథ్యంలో బోయింగ్‌ 737-9 మ్యాక్స్‌ (Boeing 737-9 Max) విమానాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తక్షణం నిలిపివేయాలని అమెరికా ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 171 విమానాలు ఆయా విమానాశ్రయాల్లో నిలిచిపోయాయి. వీటన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాత తిరిగి ఉపయోగంలోకి తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని