Published : 11 Dec 2021 16:47 IST

Loans: వ్య‌క్తిగ‌త రుణం Vs ఓవ‌ర్ డ్రాఫ్ట్‌

డబ్బు అస‌ర‌మైన‌ప్పుడు వ్యక్తిగత రుణం లేదా ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌’ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్య‌త ఇవ్వాలి అంటే.. అది మీకు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తం, కాల‌ప‌రిమితి, రుణ అర్హ‌త‌ త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. 

వ్య‌క్తిగ‌త రుణం..
బ్యాంకు ఎలాంటి తనఖా లేకుండానే నిర్ధిష్ట కాల‌ప‌రిమితిలో వ్య‌క్తులు లేదా సంస్థ‌ల‌కు నిర్ధిష్ట మొత్తాన్ని అప్పుగా ఇవ్వ‌డమే వ్య‌క్తిగ‌త రుణం. ఎటువంటి హామీ లేకుండా వ‌స్తుంది కాబ‌ట్టి దీన్ని అసురక్షిత రుణం అంటారు. ఈ రుణాన్ని పొందేందుకు ఆదాయ రుజువును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆదాయం, క్రెడిట్ చరిత్ర, తిరిగి చెల్లించే సామర్ధ్యం ఆధారంగా వ్యక్తిగత రుణం మంజూరు చేస్తారు. 

ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయం..
ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం అనేది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఖాతాదారులు త‌మ ఖాతాలో ఉండే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకోవ‌డాన్ని ఓవ‌ర్ డ్రాఫ్ట్ అంటారు. ఒకవేళ మీరు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కోసం ఎంపిక చేసుకున్నట్లైతే, అప్పుడు మీ ఖాతాను ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాగా పరిగణిస్తారు. మీ ఖాతా నుంచి అదనపు డబ్బు ఉపసంహరించుకున్న వెంటనే ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

రెండింటికి వ్య‌త్యాసం ఏంటి?

రుణ లభ్యత: 
వ్య‌క్తిగ‌త రుణం కోసం ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు బ్యాంకుకు అందించాలి. రుణం మంజూరు అయ్యి బ్యాంకులో రుణ మొత్తం జ‌మ అయిన త‌రువాత నిర్ధిష్ట వ్య‌వ‌ధిలో నెల‌వారి వాయిదాల‌లో డ‌బ్బు తిరిగి చెల్లించాలి. ముందుస్తు చెల్లింపుల‌పై చార్జీలు వ‌ర్తిస్తాయి. మ‌రొక సారి రుణం కావాలంటే మొద‌టి నుంచి ప్రాసెస్ చేయాల్సిందే. కానీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్ సౌక‌ర్యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోన‌వ‌స‌రం లేదు. ప‌రిమితి వ‌ర‌కు ఎప్పుడైనా డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

వ‌డ్డీ..
వ్యక్తిగత రుణం విషయంలో, రుణ మొత్తం మీ ఖాతాకు బదిలీ అయిన వెంటనే, ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం వడ్డీ వర్తిస్తుంది. నగదు వినియోగంతో సంబంధం లేకుండా, మీరు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 

ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా విషయంలో,  మీ ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితి నుంచి విత్డ్రా చేసుకున్న మొత్తానికి మాత్ర‌మే వ‌డ్డీ చెల్లిస్తే స‌రిపోతుంది. ఓవర్ డ్రాఫ్ట్ పై అదనపు ఫీజు లేదా ముందస్తు చెల్లింపు చార్జీలు వర్తించవు. అయితే, వ్య‌క్తిగ‌త రుణంతో పోల్చుకుంటే వ‌డ్డీ రేటు కాస్త ఎక్కువ‌గా ఉండ‌వచ్చు.

రుణం మొత్తం మార్పులు..
వ్య‌క్తిగ‌త రుణంలో రుణ గ్ర‌హీత, బ్యాంకుల ఒప్పందం మేర‌కు బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. ఈ రుణ మొత్తాన్ని మార్చుకునే వీలుండ‌దు. కానీ ఒవ‌ర్ డ్రాఫ్ట్‌లో మార్చుకునేందుకు వీలుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, మీకు రూ.50 వేల వ్య‌క్తిగ‌త రుణం మంజూరు అయితే రూ.50 వేలు మీ ఖాతాలో జ‌మ అవుతాయి. రూ.25 వేలు మాత్ర‌మే ఉప‌యోగించుకున్నా, మీరు మొత్తం రుణంపై వ‌డ్డీ చెల్లించాల్సిందే. ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయంలో రూ. 50 వేల ప‌రిమితి ఉంద‌నుకుందాం. మీకు ఎంత మొత్తం కావాలంటే అంతే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు రూ.25 వేలు విత్‌డ్రా చేసుకుంటే ఆ మొత్తం వ‌ర‌కు మాత్ర‌మే వ‌డ్డీ చెల్లిస్తే స‌రిపోతుంది. 

కాల‌వ్య‌వ‌ధి..
వ్యక్తిగత రుణం తిరిగి చెల్లింపుల‌కు గ‌రిష్టంగా 5-7 సంవత్సరాల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌కి కాల‌వ్య‌వ‌ధి లేక‌పోయినా, వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చెల్లించ‌డం మంచిది. 

రీపేమెంట్‌..
వ్య‌క్తిగ‌త రుణాన్ని ఈఎమ్ఐ రూపంలో నెల‌వారిగా ముందుగా ఎంచుకున్న కాల‌ప‌రిమితి లోపు చెల్లించాల్సి ఉంటుంది. ముంద‌స్తు చెల్లింపుల‌పై చార్జీలు వ‌ర్తించే అవ‌కాశం ఉంది. కానీ ఓవ‌ర్ డ్రాఫ్ట్‌లో మీ వ‌ద్ద డ‌బ్బు అందుబాటులో ఉన్న‌ప్పుడు చెల్లించ‌వ‌చ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని