Petrol Price Hike: ఆగని పెట్రో ధరల మంట!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. గత ఆరు రోజుల్లో ఐదోసారి ధరలు పెరిగాయి...

Published : 27 Mar 2022 09:57 IST

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. గత ఆరు రోజుల్లో ఐదోసారి ధరలు పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ (Petrol)పై 50 పైసలు, డీజిల్‌ (diesel)పై 55 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత లీటర్‌ పెట్రల్‌ ధర దేశంలో రూ.3.70, డీజిల్‌ 3.75 వరకు పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.11, డీజిల్‌ ధర రూ.90.42గా కొనసాగుతోంది.

దాదాపు నాలుగు నెలల పాటు స్థిరంగా ఉన్న చమురు (Crude Oil) ధరలు మార్చి 22 నుంచి పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజుల్లో ఒకరోజు లీటర్‌ పెట్రోల్‌పై 80 పైసలు పెరిగింది. జూన్‌ 2017 నుంచి రోజువారీ ధరల సవరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒకరోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. 4 నెలలకు పైగా పెట్రోలు, డీజిల్‌ రేట్లలో మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు పీపా ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి తొలి మూడు వారాల్లో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం (Russia-Ukraine Crisis) ప్రారంభమైన తర్వాత ఓ దశలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకూ చేరింది. అయినప్పటికీ 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 21 వరకు పెట్రో ధరల్లో మార్పులు చేయలేదు. రేట్లలో మార్పు చేయకపోవడం వల్ల భారత అగ్రగామి ఇంధన రిటైలర్లయిన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లకు కలిపి 2.25 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.19,000 కోట్ల) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.112.35, లీటర్‌ డీజిల్ ధర రూ.98.68

* విశాఖపట్నం పెట్రోల్ ధర రూ.113.08, డీజిల్ ధర రూ.99.09

* దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.99.11, డీజిల్‌ ధర రూ.90.42

* ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.113.88, డీజిల్‌ ధర రూ.98.13

* చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.104.90, డీజిల్‌ ధర రూ.95.00

* కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.108.53, డీజిల్‌ ధర రూ.93.57

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని