Radiant Cash IPO: 23న రేడియంట్‌ క్యాష్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.94-97

రేడియంట్‌ క్యాష్‌ ఐపీఓ ధరల్ని నిర్ణయించింది. మరోవైపు జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది.

Published : 20 Dec 2022 15:48 IST

దిల్లీ: రేడియంట్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ (Radiant Cash Management IPO) ధరల శ్రేణిని రూ.94- 99గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.388 కోట్లు సమీకరించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ (IPO) డిసెంబరు 23- 27 మధ్య జరగనుంది. రూ.60 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 3.31 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద విక్రయించనున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్, యెస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఈ ఐపీఓ (IPO)కి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 

2015లో రేడియంట్‌ క్యాష్‌లో ‘అసెంట్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఇండియా’ 37.2 శాతం వాటా కోనుగోలు చేసింది. దీంట్లో ఇప్పుడు కొంత భాగాన్ని ఓఎఫ్‌ఎస్‌ కింద అసెంట్‌ వదులుకోనుంది. మరోవైపు ప్రమోటర్‌ డేవిడ్‌ దేవసహాయం సైతం కొన్ని షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓలో సమీకరించిన నిధుల్లో కొంత భాగాన్ని నిర్వహణ మూలధనం కింద, మరికొంత మూలధన వ్యయం కింద ఉపయోగించనున్నారు. అలాగే కొన్ని నిధుల్ని ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాన్ల కొనుగోలుకు కూడా వినియోగించనున్నారు. మదుపర్లు కనీసం 150 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.


ఐపీఓకి జాగిల్‌ సన్నాహాలు

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ‘జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషియన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌’ ఐపీఓ (Zaggle Prepaid Ocean Services IPO)కి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.490 కోట్ల తాజా షేర్లతో పాటు 1.05 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా విక్రయించనున్నారు.

ఈ ఐపీఓలో సమీకరించిన నిధులను వ్యాపారాన్ని బలోపేతం చేయడం, రుణభారాన్ని తగ్గించుకోవడం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. జాగిల్‌ ప్రీపెయిడ్‌ను 2011లో ఏర్పాటు చేశారు. ఇది ‘బిజినెస్‌-టు-బిజినెస్‌-టు-కస్టమర్‌’ విభాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రీపెయిడ్ కార్డ్‌లు, ఉద్యోగుల నిర్వహణ (SaaS ద్వారా) ద్వారా ఖర్చులను నియంత్రించేందుకు కావాల్సిన సంయుక్త పరిష్కారాన్ని అందిస్తూ దేశంలో తమకంటూ ఓ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకుంది. ఉద్యోగుల పన్ను ప్రయోజనాలు, వ్యయ నిర్వహణ, కార్పొరేట్ బహుమతులు, రివార్డుల వంటి కార్యక్రమాల కోసం డిజిటలైజ్డ్ సొల్యూషన్‌లను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని