Reliance: రిలయన్స్‌ మళ్లీ నం.1.. ఈ జాబితాలో 3 అదానీ కంపెనీలు ఔట్‌!

Reliance Industries most valuable Indian company: భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. హురున్‌ గ్లోబల్‌ విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఈ చోటు దక్కించుకుంది.

Published : 31 Jan 2024 14:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) మరోసారి సత్తా చాటింది. భారత్‌ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికి సంబంధించి హురున్‌ గ్లోబల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్‌ 44వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి గతేడాది సైతం అగ్రస్థానంలో నిలిచిన రిలయన్స్.. ఈసారి మాత్రం 198 బిలియన్‌ డాలర్ల విలువతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అయితే,  కంపెనీ విలువ 2 శాతం మేర క్షీణించడంతో ఓవరాల్‌ ర్యాంకుల్లో 10 స్థానాలు కోల్పోయింది.

టాప్‌-500 జాబితాలో భారత్‌ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 60వ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 68వ ర్యాంకులను దక్కించుకున్నాయి. 2023లో టీసీఎస్‌ విలువ 14 శాతం పెరిగి 158 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలను మెరుగుపరుచుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌ఈఎఫ్‌సీ విలీనం వల్ల కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దీంతో ఆ బ్యాంక్‌ ఏకంగా 43 స్థానాలను మెరుగుపరుచుకుంది. భారత్‌ నుంచి కొత్తగా టైటాన్‌, సన్‌ఫార్మా కొత్తగా టాప్‌-500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీలు వాటి విలువలు కోల్పోయి ఈ జాబితాలో నుంచి వైదొలిగాయి. ఇటీవల కాలంలో ఆయా కంపెనీల విలువలు పెరగడం గమనార్హం. భారత్‌ నుంచి మొత్తంగా 18 కంపెనీలతో ఈ జాబితాలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఎన్విడియా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీలన్నీ తొలిసారి 1 ట్రిలియన్‌ డాలర్లు దాటడం గమనార్హం. ఇందులో తొలి నాలుగు కంపెనీలు గతేడాది కూడా అవే స్థానాల్లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌, ఎన్విడియా ఏఐ కంపెనీ చాట్‌జీపీటీతో సంబంధం కలిగి ఉండడంతో వాటి విలువ భారీగా పెంచుకోగలిగాయి. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు పెట్టింది. ఎన్విడియా ఆ కంపెనీకి సెమీకండక్టర్లను సమకూరుస్తోంది. దీంతో కంపెనీ విలువ మూడు రెట్లు పెరిగింది. ఇక ఓపెన్‌ఏఐ 50 బిలియన్‌ డాలర్ల విలువతో 291వ స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని