AI: భారత్‌లో కృత్రిమ మేధ అభివృద్ధికి ఎన్‌విడియాతో రిలయన్స్‌ భాగస్వామ్యం

AI: కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో ఈ అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి, అమలుకు అమెరికా టెక్‌ కంపెనీ ఎన్‌విడియాతో వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ చేతులు కలిపింది.

Published : 08 Sep 2023 19:02 IST

దిల్లీ: భారత్‌లో కృత్రిమ మేధ (Artificial intelligence- AI) ఆధారిత సూపర్‌ కంప్యూటర్ల అభివృద్ధికి అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ఎన్‌విడియా (NVIDIA), భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ (Reliance) చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు కంపెనీలు శుక్రవారం ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ కంటే శక్తిమంతమైన AI మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించాయి. NVIDIA వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కొన్ని రోజులకే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

భారత్‌లో ఎన్‌విడియా (NVIDIA) 2004 నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గురుగ్రామ్‌, హైదరాబాద్‌, పుణె, బెంగళూరులో ఈ సంస్థకు ఇంజినీరింగ్‌, డెవలప్‌మెంట్‌ కేంద్రాలున్నాయి. దాదాపు 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని విభిన్న భాషలపై శిక్షణ పొందిన, భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన అతిపెద్ద ఏఐ భాషా నమూనాను రిలయన్స్‌ సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు ఎన్‌విడియా తెలిపింది. దాని ఆధారంగా పలు ఏఐ అప్లికేషన్లను రూపొందిచనున్నట్లు పేర్కొంది. క్లౌడ్‌లోని GH200 గ్రేస్ హాప్పర్ సూపర్‌చిప్, DGX క్లౌడ్ వంటి అత్యాధునిక AI సూపర్‌ కంప్యూటింగ్ సేవలను అందించనున్నట్లు తెలిపింది.

NVIDIA ఆధారిత AI మౌలిక సదుపాయాలు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కొత్త పునాదులు వేయనున్నట్లు ప్రకటనలో ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. 450 మిలియన్ల జియో కస్టమర్ల కోసం AI అప్లికేషన్లు, సేవలను రిలయన్స్‌ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపాయి. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, డెవలపర్లు, స్టార్టప్‌లకు AI మౌలిక సదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నాయి.

వాతావరణం, ధరల వంటి సమాచారాన్ని గ్రామీణ రైతులు వారి స్థానిక భాషలో సెల్ ఫోన్‌ల ద్వారా పొందేందుకు ఏఐ ఉపకరిస్తుందని ప్రకటనలో పేర్కొన్నాయి. వైద్య నిపుణులు లేని సమయంలో వ్యాధుల నిర్ధారణకూ సాయంగా ఉంటుందని వెల్లడించాయి. దశాబ్దాల వాతావరణ డేటాను విశ్లేషించి తుపానులను అంచనా వేయవచ్చని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని