Madhabi Puri Buch: మార్చి 28 నుంచి షేర్లు కొన్న రోజే సెటిల్‌మెంట్‌: సెబీ ఛైర్‌పర్సన్‌

స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్ల విలువ వేగంగా పెరిగి.. ఒక్కసారిగా పడిపోతే అది మదుపరులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సెబీ ఛైర్‌పర్సన్ మాధుబి పురి బచ్‌ తెలిపారు.

Published : 11 Mar 2024 20:51 IST

ముంబయి: స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదేరోజు సెటిల్‌మెంట్‌ చేసే ప్రక్రియను ఈనెల 28 నుంచి అమలుచేయనున్నట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI) ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ (Madhabi Puri Buch) తెలిపారు. అయితే, ఇది ఐచ్ఛికమని అన్నారు. గత కొన్ని నెలలుగా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్ల విలువ వేగంగా పెరగడంపై స్పందిస్తూ.. మార్కెట్లో ఇలాంటి పరిణామాలు మదుపరులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్యతరహా సంస్థల (SME) విభాగంలో చోటు చేసుకుంటున్న ధరల అవకతవకలను గమనిస్తున్నట్లు తెలిపారు. ఐపీవోతోపాటు, ట్రేడింగ్‌లోనూ ఇది జరుగుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని మదుపరులకు సూచించారు. సోమవారం అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (AMFI) నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్‌ఎంఈల గురించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ధరల తారుమారుకు సంబంధించిన సంకేతాలను సాంకేతిక సాయంతో గుర్తిస్తున్నాం. దీని గురించి కొన్ని నమూనాలను సేకరించాం. మార్కెట్‌ భాగస్వాముల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నాం. ప్రస్తుతం మా వద్ద ఉన్న డేటాతో చర్యలు చేపట్టలేం. పూర్తిస్థాయి సమాచారాన్ని విశ్లేషించేందుకు నిపుణుల బృందంతో కలిసి సెబీ పనిచేస్తోంది. అందులో ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే పబ్లిక్ కన్సల్టేషన్‌ జారీ చేస్తాం’’ అని మాధుబి తెలిపారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎస్‌ఎంఈలు భిన్నమైనవనే విషయాన్ని మదుపరులు అర్థం చేసుకోవాలని అన్నారు. ఎస్‌ఎంఈ నిబంధనలు, నష్ట భయాల గురించి మదుపరులకు తెలిసేలా విధివిధానాలు రూపొందించనున్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని