Stock Market: లాభాల్లోకి ఎగబాకిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి...

Published : 27 Sep 2022 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం లాభాల్లో ఉండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. మరోవైపు గతకొన్ని రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అయితే, స్థూలంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న బలహీనతల నేపథ్యంలో దేశీయ సూచీలు ఎప్పటి వరకు లాభాల్లో కొనసాగుతాయన్నది చూడాల్సి ఉంది. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. మరోవైపు డాలర్‌ అంతకంతకూ బలపడుతుండడంతో ఇతర ప్రధాన కరెన్సీలన్నీ భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. అలాగే ఆర్థికమాంద్యం భయాలు బలపడుతున్న కొద్దీ చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్‌ 436 పాయింట్లు లాభపడి 57,581 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 17,140 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమై రూ.81.35 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది. ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

మహీంద్రా లాజిస్టిక్స్‌: గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న రివిగో సర్వీసెస్‌కు చెందిన బీ2బీ ఎక్స్‌ప్రెస్‌ బిజినెస్‌ను మహీంద్రా లాజిస్టిక్‌ కొనుగోలు చేయనుంది. బిజినెస్‌ ట్రాన్స్‌ఫర్‌ అగ్రిమెంట్‌ ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది.

హెచ్‌ఏఎల్‌: ఇస్రోకు కావాల్సిన రాకెట్‌ ఇంజిన్ల తయారీ కోసం హెచ్‌ఏఎల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది.

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌: ఇంప్యాక్ట్‌ డేటా సొల్యూషన్స్‌ లిమిటెడ్‌లోని తమ పూర్తి వాటాను హెక్సాట్రానిక్‌ గ్రూప్‌ ఏబీకి విక్రయించాలని స్టెరిటైల్‌ టెక్‌ అనుబంధ సంస్థ స్టెరిలైట్‌ గ్లోబల్‌ వెంచర్‌ నిర్ణయించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts