stock market: భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

Published : 30 Jun 2023 09:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం ట్రేడింగ్‌ను భారీ లాభాల్లో రికార్డు స్థాయి శిఖరాల వద్ద మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 19,071 వద్ద, సెన్సెక్స్‌ 342 పాయింట్లు పెరిగి 64,258 వద్ద ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, బెంగాల్‌ అండ్‌ అస్సాం కంపెనీ, సుజ్లాన్‌ ఎనర్జీ, నిప్పన్‌ లైఫ్‌, శిల్పా మెడికేర్‌ షేర్ల విలువ పెరగ్గా.. ఎంసీఎక్స్‌, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌, టాటా కమ్యూనికేషన్స్‌ షేర్ల విలువ కుంగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.03గా ప్రారంభమైంది.

మరోవైపు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్‌ ప్రారంభించాయి. హంగ్‌కాంగ్‌, చైనా సూచీలు లాభాల్లో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈఎక్స్‌, ఆస్ట్రేలియా సూచీ నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) బంగాళాఖాతంలోని తమ కేజీ-డి5 బ్లాక్‌లో ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను టొరెంట్‌ గ్యాస్‌తో పాటు 3 సంస్థలకు విక్రయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇ-వేలంలో రోజుకు 1.4 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువును యూనిట్‌కు 11.3 డాలర్ల చొప్పున విక్రయించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కేజీ డి6 బ్లాక్‌ పక్కనే ఓఎన్‌జీసీ కేజీ డి5 బ్లాక్‌ ఉంది. దీంతో ఓఎన్‌జీసీ షేరు 0.5శాతం పెరిగింది.

డీలిస్టింగ్‌ ప్రక్రియలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈక్విటీ షేర్లను రద్దు చేసి, కంపెనీ వాటాదార్లకు ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లను జారీ చేయనున్నట్లు ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రతి 100 ఈక్విటీ షేర్లకు, 67 ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని