ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ లాభంలో 37% వృద్ధి

బ్యాటరీల సంస్థ ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం.

Published : 01 May 2024 03:42 IST

తుది డివిడెండ్‌ రూ.2

దిల్లీ: బ్యాటరీల సంస్థ ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.3,543 కోట్ల నుంచి రూ.4,009 కోట్లకు పెరిగింది. పూర్తి  ఆర్థిక సంవత్సరానికి (2023-24) నికర లాభం రూ.1,053 కోట్లుగా నమోదైంది. 2022-23లో లాభం రూ.904 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం రూ.14,592 కోట్ల నుంచి రూ.16,029 కోట్లకు పెరిగింది. 2023-24 ఏడాదికి ఒక్కో షేరుకు తుది డివిడెండు రూ.2ను బోర్డు ప్రతిపాదించింది. ఆటోమోటివ్‌, పారిశ్రామిక విభాగాల్లో భవిష్యత్తులోనూ మంచి విక్రయాల వృద్ధి నమోదు కావొచ్చని.. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి లాభదాయకత పెరగగలదని కంపెనీ ఎండీ సుబిర్‌ చక్రబర్తి పేర్కొన్నారు.


స్పందన స్ఫూర్తి లాభం రూ.129 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: సూక్ష్మ రుణ సంస్థ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.709.60 కోట్ల ఆదాయంపై రూ.128.64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.533.01 కోట్లు, నికర లాభం రూ.105.57 కోట్లుగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.2,534 కోట్లు, నికర లాభం రూ.500.66 కోట్లుగా ఉన్నాయి. 2021-22లో ఆదాయం రూ.1,477 కోట్లు, నికర లాభం రూ.12.39 కోట్లుగా ఉన్నాయి. మొత్త నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.11,973 కోట్లుగా ఉండగా, ఆర్థిక సంవత్సరం మొత్తంలో కొత్తగా 13.9 లక్షల మందికి రుణాలు ఇచ్చింది.


రూ.5000 కోట్లు సమీకరించనున్న సెంట్రల్‌ బ్యాంక్‌

దిల్లీ: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మార్చి త్రైమాసికంలో రూ.807 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022623 ఇదే త్రైమాసిక లాభం రూ.571 కోట్లతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.8,567 కోట్ల నుంచి రూ.9,699 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.7,144 కోట్ల నుంచి రూ.8,337 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 8.44% నుంచి 4.5 శాతానికి; నికర ఎన్‌పీఏలు 1.77% నుంచి 1.23 శాతానికి తగ్గాయి. దీంతో మొండిబకాయిలకు కేటాయింపులు రూ.789 కోట్ల నుంచి రూ.509 కోట్లకు పరిమితమయ్యాయి. ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) లేదా రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.5000 కోట్ల వరకు మూలధనాన్ని సమీకరించేందుకు బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని