2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్‌ తెలిపారు.

Published : 01 May 2024 03:42 IST

యూకో బ్యాంక్‌ ఎండీ

కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో ప్రభుత్వ వాటా 95.39 శాతంగా ఉంది. ప్రజల వాటా కనీస పరిమితి నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు కల్లా ప్రభుత్వ వాటాను 75 శాతానికి యూకో బ్యాంక్‌ తగ్గించుకోవాల్సి ఉంది. మరో 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ప్రజల కనీస వాటా పరిమితి నిబంధన పాటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ‘మా కనీస మూలధన నిష్పత్తి 16.98 శాతంగా ఉన్నందున.. వ్యాపార వృద్ధి కోసం ప్రస్తుతం మూలధనం అవసరమైతే మాకు లేదు. నియంత్రణ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ వాటాను 75 శాతానికి తప్పక తగ్గించుకోవాలి. దీనిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాధించాలని అనుకుంటున్నాం. ఇందుకోసం 400 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. దీనిని దశలవారీగా అమలు చేస్తామ’ని యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశ్వనీ కుమార్‌ తెలిపారు. నిబంధనల పాటింపు కోసం రూ.10 ధర వద్ద 330-340 కోట్ల షేర్లను జారీ చేస్తే సరిపోతుందని.. కానీ అదనంగా మరికొన్ని షేర్లను జారీ చేసే అవకాశాన్ని కూడా అట్టేపెట్టుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు.

కొత్తగా 130 శాఖలు ప్రారంభిస్తాం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో 12-14% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుమార్‌ వెల్లడించారు. కార్పొరేట్‌ రుణాల వృద్ధి లక్ష్యం 3-4% మధ్య ఉండొచ్చని భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తక్కువ సంఖ్యలో శాఖలు ఉన్న లేదా శాఖలు లేని ప్రాంతాల్లో కొత్తగా 130 శాఖలను తెరిచే యోచనలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూకో బ్యాంకుకు 3,300 శాఖలు ఉండగా.. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే 35% ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ మౌలిక వసతులపై రూ.1000 కోట్లు వెచ్చించనున్నట్లు కుమార్‌ తెలిపారు. జనవరి- మార్చి త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ నికర లాభం 9.5% తగ్గి రూ.525.77 కోట్లకు పరిమితమైంది. వేతన సవరణ కోసం అధిక కేటాయింపులు చేయాల్సి రావడం ఇందుకు కారణంగా బ్యాంకు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని