సగానికి తగ్గిన ఐఓసీ లాభం

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది.

Published : 01 May 2024 03:41 IST

ఇంధన ధరల కోత వల్లే
తుది డివిడెండ్‌ 70%

దిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.10,058.69 కోట్లు కావడం గమనార్హం. 2023 అక్టోబరు- డిసెంబరులోనూ సంస్థ లాభం రూ.8,063.39 కోట్లుగా ఉంది. ముడిచమురు వ్యయాలు పెరిగినప్పటికీ, ఎన్నికల కారణంగా మార్చి మధ్యలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను 2% తగ్గించినందునే.. పెట్రో రసాయనాల వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల, మార్జిన్లపై ప్రభావం పడినట్లు ఐఓసీ తెలిపింది. వంట గ్యాస్‌ ధరలను ప్రభుత్వం యథాతథంగా ఉంచడం వల్ల వాటిల్లిన రూ.1,017 కోట్ల నష్టంపై ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోవడమూ మరో కారణంగా పేర్కొంది. త్రైమాసిక ఆదాయం రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.21 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2023-24లో ఐఓసీ రూ.39,618.84 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. కంపెనీ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఇప్పటివరకు చూస్తే, 2021-22లో నమోదైన రూ.24,184.10 కోట్లే అత్యధిక లాభంగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను సుమారు రెండేళ్లపాటు యథాతథంగా ఉంచడం వల్లే వార్షిక లాభం ఇంతలా ఉంది.  2023-24లో ఐఓసీ ఆదాయం రూ.8.71 లక్షల కోట్లకు తగ్గింది. 2022-23లో ఇది రూ.9.41 లక్షల కోట్లుగా ఉంది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.7 (70%) తుది డివిడెండును ఐఓసీ ప్రకటించింది. ఇంతకుమునుపు చెల్లించిన రూ.5 మధ్యంతర డివిడెండుకు ఇది అదనం.

పెట్రో రసాయనాల వ్యాపారంలో నష్టం: జనవరి- మార్చి త్రైమాసికంలో పెట్రో రసాయనాల వ్యాపారంలో రూ.400 కోట్ల నష్టాన్ని ఐఓసీ చవిచూసింది. పెట్రో రసాయనాల ఉత్పత్తుల విక్రయాలు 23.73 మిలియన్‌ టన్నులకు పెరిగాయి. 2022-23 ఇదే త్రైమాసికంలో ఇవి 22.95 మిలియన్‌ టన్నులుగా ఉండగా.. అక్టోబరు- డిసెంబరులో 23.32 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇంధన అమ్మకాలు 90.65 మిలియన్‌ టన్నుల నుంచి 92.31 మిలియన్‌ టన్నులకు పెరిగాయి.

2023-24లో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 12.05 డాలర్లను ఆర్జించింది. అంతకుముందు త్రైమాసికంలో ఆర్జించిన 19.52 డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే.
పునరుత్పాదక విద్యుత్‌పై రూ.5,215 కోట్ల పెట్టుబడి: దేశంలో 1 గిగావాట్‌ పునరుత్పాక విద్యుత్‌ సామర్థ్య ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు రూ.5,215 కోట్ల  పెట్టుబడులు పెట్టే యోచనలో ఐఓసీ ఉంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. సౌర/పవన/ సౌర- పవన హైబ్రిడ్‌ ప్రాజెక్టుగా ఇది ఉండే అవకాశం ఉందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దీనిని దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొంది.

జనవరి- మార్చిలో నికర లాభం సగానికి పైగా తగ్గడంతో బీఎస్‌ఈలో ఐఓసీ షేరు 4.44% నష్టంతో రూ.168.95 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 4.41% క్షీణతతో రూ.168.95 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని