సంక్షిప్తవార్తలు (8)

సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) నుంచి అనుమతి తీసుకుంది.

Updated : 01 May 2024 03:51 IST

మధుమేహ వ్యాధికి సనోఫి ఇండియా మందు

ఈనాడు, హైదరాబాద్‌: సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. స్థూల కాయం, టైప్‌- 2 మధుమేహ వ్యాధి చికిత్సలో ఈ మందును వినియోగిస్తారు. ఒక ఇంజెక్షన్‌ (పెన్‌) సొలిక్వా ధర రూ.1850 ఉంటుంది. ఈ మందు రోగుల జీవన ప్రమాణాలను ఎంతగానో పెంపొందిస్తుందని సనోఫి ఇండియా పేర్కొంది.


దక్షిణాదిలో విస్తరణ: మోడిఫై

ఈనాడు, హైదరాబాద్‌: ఎగుమతులు నిర్వహిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ)కు నగదు సమస్య ఎదురుకాకుండా బీ2బీ రుణాలను అందిస్తున్నట్లు ఫిన్‌టెక్‌ సంస్థ మోడిఫై వెల్లడించింది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రధానంగా ఫార్మా, దుస్తులు, రసాయనాలు, సౌర విద్యుత్‌, తయారీ రంగ సంస్థలకు రుణాలను అందిస్తుంది. ఎస్‌ఎంఈలు అంతర్జాతీయంగా పోటీ పడేందుకు తాము రుణాల ద్వారా వీలు కల్పిస్తున్నట్లు  మోడిఫై ఇండియా కంట్రీ హెడ్‌ సచిన్‌ నిగమ్‌ తెలిపారు. 2019లో ప్రారంభమైన నాటి నుంచి, ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 2.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 20,750 కోట్ల) మేరకు రుణాలు అందించామని, ఇందులో 15% తెలుగు రాష్ట్రాల సంస్థలకే ఇచ్చినట్లు వెల్లడించారు. రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4150 కోట్ల) వరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పూర్తిగా డిజిటల్‌ విధానంలోనే రుణాలు జారీ చేస్తున్న తాము, ఈ ఏడాది చివరి కల్లా హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఎంఎఫ్‌ల్లో ఫ్రంట్‌ రన్నింగ్‌ నియంత్రణకు సెబీ చర్యలు

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌  (ఎంఎఫ్‌)లలో ఫ్రంట్‌ రన్నింగ్‌, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు సెబీ చర్యలు చేపట్టింది. సంస్థ భవిష్యత్‌ లావాదేవీలపై ప్రభావం చూపించే అంతర్గత సమాచారం ముందుగానే తెలుసుకుని ట్రేడింగ్‌ చేయడాన్ని ఫ్రంట్‌ రన్నింగ్‌, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ తరహా అనైతిక కార్యకలాపాలను నియంత్రించడం, గుర్తించే నిమిత్తం ఓ సంస్థాగత వ్యవస్థను అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) రూపొందించుకునేలా సంబంధింత నియంత్రణ నిబంధనలను సవరించాలని సెబీ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థాగత వ్యవస్థ జవాబుదారీతనం, బాధ్యతను ఏఎంసీల యాజమాన్యానికే అప్పగించేలా సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. లావాదేవీల్లో మరింత పారదర్శకత తీసుకు రావాలంటే ఓ ప్రజావేగు వ్యవస్థను కూడా ఏఎంసీలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని బోర్డు సమావేశం అనంతరం సెబీ తెలిసింది. యాక్సిస్‌ ఏఎంసీ, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రెండు ఫ్రంట్‌ రన్నింగ్‌ సంఘటనల నేపథ్యంలో, సెబీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. యాక్సిస్‌ ఏంఎసీ వ్యవహారంలో బ్రోకరు- డీలర్లు, కొందరు ఉద్యోగులు, సంబంధిత సంస్థలు; ఎల్‌ఐసీలో ఒక ఉద్యోగి ఆయా సంస్థల ఫ్రంట్‌- రన్‌ ట్రేడ్‌లను నిర్వహించినట్లు గుర్తించారు. అయితే సంస్థాగత వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను యాంఫీతో సంప్రదింపుల ఆధారంగా త్వరలోనే సెబీ నిర్ణయించనుంది.


ఐరోపా వృద్ధి 0.3 శాతం

ఫ్రాంక్‌ఫర్ట్‌: ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో ఐరోపా ఆర్థిక వ్యవస్థ 0.3% వృద్ధి నమోదుచేసింది. వినియోగదారులపై ద్రవ్యోల్బణ భారం తగ్గడం, జర్మనీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఇందుకు కలిసొచ్చాయి. 2022 మూడో త్రైమాసికం తర్వాత ఐరోపా బలమైన వృద్ధి ఇదే. 2023 చివరి త్రైమాసికాల్లో వృద్ధి 0.1% తగ్గడంతో ఐరోపా సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.


కీలక రంగాల వృద్ధి 5.2%

దిల్లీ: ఈ ఏడాది మార్చిలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి 5.2 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన 7.1% వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలను కీలక రంగాలుగా పరిగణిస్తారు.  గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కీలక రంగాల వృద్ధి 7.5 శాతంగా నమోదైంది. 2022-23లో ఇది 7.8 శాతంగా ఉంది. దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 కీలక రంగాల వాటా 40.27% ఉంటుంది.


మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌కు రూ.6.42 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: కేపీఓ (నాలెడ్జ్‌ ప్రాసెసింగ్‌ అవుట్‌సోర్సింగ్‌) సేవల సంస్థ మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.42.24 కోట్ల ఆదాయాన్ని, రూ.6.42 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఎబిటా రూ.10.17 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదేకాలంతో పోల్చితే ఆదాయం, నికరలాభం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ రూ.160.74 కోట్ల ఆదాయాన్ని, రూ.27.84 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఎబిటా రూ.44.39 కోట్లుగా ఉంది. జీతభత్యాల వ్యయాలు, సాఫ్ట్‌వేర్‌ ఖర్చులు, ఏఎంసీ ఛార్జీలు పెరిగినందునే లాభాలు తగ్గినట్లు సంస్థ యాజమాన్యం వివరించింది. సివిల్‌, మెకానికల్‌ విభాగాల్లో అదనంగా 173 మంది ఇంజినీర్లను నియమించినందున ప్రెస్‌ టూల్స్‌, స్పెషల్‌ పర్పస్‌ మెషీన్స్‌, ఇండస్ట్రీయల్‌ ఆటోమేషన్‌ విభాగాల్లో కొత్త ప్రాజెక్టులు నిర్వహించడానికి వీలుకలుగుతుందని పేర్కొంది. ఈ కొత్త విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆదాయాలు కనిపిస్తాయని వివరించింది.


వైసల్‌ లిమిటెడ్‌లో జీఎంఆర్‌కు వాటా

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయాల్లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేవలు అందించే సంస్థ వైసల్‌ లిమిటెడ్‌లో 8.4% వాటాను జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొనుగోలు చేసింది. రూ.56.66 కోట్లతో ఈ వాటా తీసుకున్నట్లు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ వెల్లడించింది. వైసల్‌ లిమిటెడ్‌ ప్రస్తుతం దిల్లీ, హైదరాబాద్‌, గోవా విమానాశ్రయాల్లో డిజిటల్‌ సేవలు అందిస్తోంది. విమానాశ్రయాల్లో వివిధ రకాల సేవలు అందించే సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు కొంతకాలంగా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వైసల్‌ లిమిటెడ్‌లో వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది.


గ్రాన్యూల్స్‌ ఔషధానికి అమెరికాలో అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా అమెరికాలో కోల్చిసిన్‌ క్యాప్సూల్స్‌ (0.6 ఎంజీ) అనే ఔషధాన్ని విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఇది హిక్మా ఇంటర్నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థకు చెందిన మిటిగేట్‌ క్యాప్సూల్స్‌ (0.6 ఎంజీ) కి సమానమైన మందు. దీన్ని గౌట్‌ వ్యాధిలో కొన్ని లక్షణాల నివారణకు వినియోగిస్తున్నారు. అమెరికాలో ఈ మందుకు ఏటా 55 మిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉంది. యూఎస్‌లోని తన అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌., ద్వారా ఈ మందును విక్రయించడానికి గ్రాన్యూల్స్‌ ఇండియా సన్నద్ధమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని