Musk vs Zuckerberg: కేజ్ ఫైట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. మస్క్‌ ట్వీట్‌కు జుకర్‌ కౌంటర్‌

Musk vs Zuckerberg: మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ మధ్య పోరు జరుగుతుందని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా  మస్క్‌, జుకర్ పోస్టులతో వీరి మధ్య పోరు ఖాయంగా కన్పిస్తోంది.

Published : 07 Aug 2023 11:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) మధ్య కేజ్‌ ఫైట్‌ (cage fight) ఖాయంగానే కన్పిస్తోంది. దీనిపై మస్క్‌ ఆదివారం చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. తమ మధ్య జరిగే పోరు ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని స్పేస్‌ఎక్స్‌ అధినేత చెప్పారు. అయితే, ఈ ట్వీట్‌కు జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ మస్క్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఇంతకంటే మంచి వేదిక లేదా? అంటూ ఎద్దేవా చేశారు.

‘‘జుకర్‌, మస్క్‌ మధ్య జరిగే పోరు ఎక్స్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ అవుతుంది. దాని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయి’’ అని మస్క్‌ (Elon Musk) నిన్న పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై జుకర్‌బర్గ్‌ తాను కొత్తగా ప్రారంభించిన ‘థ్రెడ్స్‌ (Threads)’ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఛారిటీ కోసం డబ్బును సేకరించేప్పుడు ఇంతకంటే విశ్వసనీయమైన వేదికను మనం ఉపయోగించలేమా?’’ అని కౌంటర్‌ ఇచ్చారు. జుకర్‌బర్గ్‌ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కేజ్ ఫైట్‌ కంటే ముందే వీరిద్దరి నుంచి పంచ్‌లు దూసుకొస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ రోజైనా నేను రెడీ: జుకర్‌

ఇదిలా ఉండగా.. ఈ కేజ్‌ ఫైట్‌ కోసం తాను సిద్ధమవుతున్నానని మస్క్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘‘ఈ పోరు కోసం నేను రోజంతా బరువులు ఎత్తుతూనే ఉన్నాను. ఇంటి వద్ద వర్క్‌అవుట్‌ చేయడానికి సమయం లేకపోవడంతో ఆఫీసుకే వాటిని తెచ్చుకున్నా’’ అని ఆయన రాసుకొచ్చారు. దీనికి కూడా జుకర్‌బర్గ్‌ (Zuckerberg) గట్టిగా బదులిచ్చారు.

మరో అయిదేళ్లు ముకేశ్‌ అంబానీయే!

‘‘ఈ రోజు ఫైట్‌ చేయడానికైనా నేను సిద్ధమే. ఆయన (మస్క్‌) తొలుత దీని గురించి ఛాలెంజ్‌ చేసినప్పుడు ఆగస్టు 26వ తేదీని నేను సూచించా. కానీ, ఆయన నుంచి అంగీకారం రాలేదు. ఈ పోరు గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ గేమ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యర్థి ఎలాంటి శిక్షణ తీసుకున్నా సరే.. పోటీని నేను కొనసాగిస్తా’’ అని జుకర్‌ మరో కౌంటర్‌ వేశారు.

కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్‌, జుకర్‌బర్గ్‌ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఇవి తారస్థాయికి చేరాయి. ఎక్స్‌ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్‌ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ ఆరోపణలు చేశారు. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను డిజైన్‌ చేశారని పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే జుకర్‌బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్‌ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్‌ ఎక్స్‌లో పేర్కొన్నాడు. దీనిపై జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ ‘ప్లేస్‌ ఎక్కడో చెప్పు’ అంటూ సవాల్‌కు సై అన్నాడు. తొలుత ఇదంతా ప్రచారం కోసమేనని నెటిజన్లు భావించినా.. వీరిద్దరూ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. తాజాగా మస్క్‌, జుకర్ పోస్టులతో వీరి మధ్య పోరు ఖాయమేనని తెలుస్తోంది. అయితే, ఈ ఫైట్‌ ఎప్పుడు జరుగనుందో మాత్రం ఇంత వరకు తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని