మరో అయిదేళ్లు ముకేశ్‌ అంబానీయే!

దేశీయంగా అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ)గా ముకేశ్‌ అంబానీ (66)ని మరో అయిదేళ్లు కొనసాగించేందుకు వాటాదార్ల ఆమోదాన్ని కంపెనీ కోరుతోంది.

Updated : 07 Aug 2023 07:18 IST

వేతనం లేకుండానే సీఎండీగా
వాటాదార్ల ఆమోదం కోరుతున్న ఆర్‌ఐఎల్‌

దిల్లీ: దేశీయంగా అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ)గా ముకేశ్‌ అంబానీ (66)ని మరో అయిదేళ్లు కొనసాగించేందుకు వాటాదార్ల ఆమోదాన్ని కంపెనీ కోరుతోంది. ప్రస్తుతం ముకేశ్‌ పదవీకాలం 2024 ఏప్రిల్‌ 19 వరకు ఉంది. దీన్ని 2029 ఏప్రిల్‌ 18 వరకు పొడిగించాలన్నది కంపెనీ బోర్డు ప్రతిపాదన. 2027 ఏప్రిల్‌ 19కి ఆయనకు 70 ఏళ్లు వస్తాయి. కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వయసు 70 ఏళ్లు మించకూడదనే కంపెనీ చట్ట నిబంధన ఉంది. అందువల్ల 2029 వరకు ముకేశ్‌ సీఎండీగా కొనసాగాలంటే, వాటాదార్లు ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంది. 1977 నుంచి ఆర్‌ఐఎల్‌ బోర్డులో ఉన్న ముకేశ్‌, ధీరూభాయి అంబానీ మరణంతో 2002 జులైలో కంపెనీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. 2008-09 నుంచి 2019-20 వరకు ఆయన వార్షిక వేతనంగా రూ.15 కోట్లు చొప్పున తీసుకున్నారు. కొవిడ్‌ 19 పరిణామాల నుంచి ఆయన వేతనం ఏమీ తీసుకోవడం లేదు.

2,62,558 మందికి ఉద్యోగాలు

గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,62,558 మందికి తమ గ్రూప్‌ వ్యాపారాల్లో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. రిటైల్‌లో 2,45,581 మంది ఉద్యోగులున్నారు.

రిటైల్‌లో 100 కోట్ల లావాదేవీలు

రిలయన్స్‌ రిటైల్‌, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 100 కోట్ల లావాదేవీలకు పైగా నిర్వహించింది. నమోదిత ఖాతాదారుల సంఖ్య 24.90 కోట్లకు చేరిందని సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. కంపెనీ ఆదాయం రూ.2.60 లక్షల కోట్లలో, డిజిటల్‌-కొత్త వ్యాపార వాటా 18 శాతంగా ఉంది. 2022-23లో జతచేర్చిన 3,300 స్టోర్లతో కలిపి మొత్తం విక్రయశాలల సంఖ్య 18,040కి చేరింది.   6.56 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్లున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, దుస్తుల విభాగాల్లో ప్రతిష్ఠాత్మక బ్రాండ్లను కొనుగోలు చేస్తోంది. తమ కొత్త వ్యాపారంలో 30 లక్షల మంది చిరు వ్యాపారులు భాగస్వాములయ్యారని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా రిటైల్‌ వ్యాపారం 800 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.65.60 లక్షల కోట్ల) స్థాయిలో ఉండగా, 2030కి 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్లకు పైగా)కు చేరుతుందనేది అంచనా.


రిలయన్స్‌ జియోకు రూ.18,000 కోట్లు

దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ కోసం స్వీడిష్‌ ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ ఏజెన్సీ నుంచి 2.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.18,000 కోట్ల) ఆర్థిక సాయం అందుకున్నట్లు రిలయన్స్‌ జియో ఆదివారం తెలిపింది. 5జీ నెట్‌వర్క్‌కు అవసరమైన టెలికాం గేర్లను స్వీడన్‌ సంస్థ ఎరిక్సన్‌, ఫిన్లాండ్‌ కంపెనీ నోకియా నుంచే జియో సమీకరిస్తోంది. వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను 6.2 లక్షల గ్రామాల్లో అందిస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంలో 70,000 మందికి ఉపాధి కల్పించామని సంస్థ తెలిపింది.


జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ త్వరలో నమోదు

28న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎం

దేశంలోనే అతి పెద్ద రిటైలర్‌గా, టెలికాం ఆపరేటర్‌గా మారిన ముకేశ్‌ అంబానీ తాజాగా ఆర్థిక సేవలు, కొత్త ఇంధన వ్యాపారాలపై దృష్టి సారించారు. 2035 నాటికి నికర శూన్య కర్బన ఉద్గార స్థితికి మారాలనే లక్ష్యాన్ని ఆర్‌ఐఎల్‌ నిర్దేశించుకుంది. ఇటీవల సంస్థ నుంచి విడదీసిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. డిజిటల్‌, రిటైల్‌ వ్యాపారాల స్థాయిని ప్రభావితం చేస్తుందని ఆర్‌ఐఎల్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ సంస్థను స్టాక్‌ మార్కెట్‌లో త్వరలోనే నమోదు చేస్తామని ముకేశ్‌ పేర్కొన్నారు. ఎప్పుడనేది, ఈనెల 28న జరిగే వాటాదార్ల వార్షిక సమావేశం (ఏజీఎం)లో ఆయన వెల్లడించే అవకాశం ఉంది.

  • జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 6.1% వాటా ఉంది. మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు బ్లాక్‌రాక్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.
  • హరిత ఇంధనం-రసాయనాలపైనా ముకేశ్‌ దృష్టి కేంద్రీకరించారు. పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్‌ల ఉత్పత్తి, ప్రపంచంలోనే పెద్దదైన గిగా కాంప్లెక్స్‌లో హరిత ఇంధన పరికరాల తయారీ, 100 గిగావాట్‌ సామర్థ్యాన్ని చేరుకునేందుకు రిలయన్స్‌   రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. జామ్‌నగర్‌లోని గిగా కాంప్లెక్స్‌లో, ఫ్యాక్టరీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి, పునరుత్పాదక ఇంధన వనరులకు పరివర్తనం చెందడం కంపెనీ చరిత్రలో కీలక మైలురాయి అని ముకేశ్‌ తెలిపారు.

     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని