తొలి జీతం రాగానే పెట్టుబడులు పెట్టాలా?

20 ఏళ్ల వయసులో పెట్టుబడులు, జీవితంలో గొప్ప మలుపునకు శ్రీకారం అని చెప్పుకోవచ్చు........

Updated : 01 Jan 2021 17:11 IST

20 ఏళ్ల వయసులో పెట్టుబడులు, జీవితంలో గొప్ప మలుపునకు శ్రీకారం అని చెప్పుకోవచ్చు

ఎంత తొందరగా మదుపు ప్రారంభిస్తే… అంత తొందరగా ధనవంతులు కావచ్చు. అంటే, కాలం గడుస్తున్న కొద్దీ మీ పెట్టుబడిపై అధిక రాబడి వస్తుందన్నమాట. జీవితంలో తొందరగా మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడం సులువవుతుంది. అందుకోసం ఏం చేయాలి? చాలామంది పెట్టుబడులను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలుసా? వివాహం అయి… పిల్లలు పుట్టాక… కానీ, అప్పటికే ఆలస్యం అయ్యిందని వారు గుర్తించరు. యువకులుగా ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే… వారి దగ్గర కావాల్సినంత సమయం ఉంటుంది. అసలు అదే వారికి శక్తి. ఉద్యోగంలో చేరిన కొత్తలో కొంత డబ్బును పెట్టుబడి పెట్టేందుకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ, ఇది మీరు పెట్టుబడులు ప్రారంభించేందుకు అడ్డంకిగా మాత్రం మారకూడదు. మీరు ఆర్జించిన మొదట్లో కొన్నేళ్లపాటు చేసిన మదుపు… భవిష్యత్తులో పెద్ద ఎత్తున సంపద సృష్టించడానికి బాటలు వేస్తుందని మర్చిపోకూడదు. 20 ఏళ్ల వయసులో పెట్టుబడుల ప్రపంచంలోకి ప్రవేశించడం జీవితంలో గొప్ప మలుపునకు శ్రీకారం అని చెప్పుకోవచ్చు. తక్కువ వేతనం… విద్యారుణంలాంటివి ఉన్నా సరే. వ్యక్తిగత జీవితమైనా… పెట్టుబడుల్లోనైనా అనిశ్చితి సహజం. కానీ, యువకులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే… ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుపోయాయి. ప్రపంచంలో ఒక మూలన ఏదైనా ఇబ్బంది ఏర్పడితే… దాని ప్రభావం రెండో వైపు ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లూ దానికి అనుగుణంగా స్పందిస్తాయి. ఇలాంటివాటిని పట్టించుకోకుండా… క్రమం తప్పకుండా మదుపు చేసే అలవాటు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చిన్న విషయాలే. సంపాదన మొదలు పెట్టినప్పుడే… సరైన ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటే… మీ దగ్గర కావాల్సినంత సొమ్ము ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. ఇలాంటి క్రమశిక్షణ రావడానికి… మ్యూచువల్‌ ఫండ్లు తోడ్పడతాయని చెప్పొచ్చు.

ఫండ్లు… సరైనవే:

ప్రస్తుతం దేశంలో చాలామంది యువకులు తాము పెట్టుబడి పెట్టేందుకు సరైన మార్గాలేమున్నాయని అన్వేషిస్తున్నారు. వారంతా ప్రణాళికాయుతంగా, ఒక పద్ధతి ప్రకారం మదుపు చేయాలని అనుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ రోజుల్లో చాలామంది యువకులు తమ ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభంలోనే మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. తమ జీవితం పట్ల వారందరికీ ఉన్నత ఆలోచనలు ఉంటున్నాయి. తమ జీవన శైలి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం గురించే కాకుండా భవిష్యత్తు గురించీ ఇలాగే ఆలోచిస్తున్నారు.

చిన్న వయసులో ఉన్నప్పుడు కాస్త నష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడుల్లో 80శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించినా ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలంలో పెట్టుబడి నుంచి సంపదను సృష్టించే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వీటిపై కాస్త అధికంగానే దృష్టి పెట్టాలి. వీటిని ఎంత తొందరగా మనం సొంతం చేసుకుంటే… అంత వేగంగా మన డబ్బు వృద్ధి చెందుతుంది. అయితే, ఈక్విటీల్లో నేరుగా మదుపు చేసే బదులు మ్యూచువల్‌ మార్గంలో వెళ్లడం ఆచరణీయం.

  • మ్యూచువల్‌ ఫండ్లు వైవిధ్యమైన పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. అదే సమయంలో ఇవి నిపుణుల పర్యవేక్షణలో పనిచేస్తాయి. అనేక రకాల పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడంతో నష్టభయం కూడా తక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా రాబడిని అందించడంలోనూ ఇవి ముందే ఉంటాయి. వీటి గురించి నిరంతరం పట్టించుకోవాల్సిన అవసరమూ ఉండదు. అంటే, బోలెడంత సమయం మీకు ఆదా అవుతుంది. ఏడాదికి మించి దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే రాబడికీ పన్ను మినహాయింపులు అదనపు ప్రయోజనం.

చరిత్ర ఏం చెబుతోంది?
నిజంగా… ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయా? దీనికోసం ఈ ఉదాహరణలు గమనిద్దాం… మీరు 1979-80ల మధ్య రూ.లక్షను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, సెన్సెక్స్‌ సూచీలో మదుపు చేశారనుకుందాం… 2017 వరకూ వీటిని అలాగే కొనసాగిస్తే… ఈ 37ఏళ్లలో ఎఫ్‌డీలు 22 రెట్లు, బంగారం 32 రెట్లు వృద్ధి చెందగా… సెన్సెక్స్‌ మాత్రం 320రెట్లు వృద్ధి చెందింది.

అయితే, పెట్టుబడుల ప్రారంభానికి ఆలస్యం అవడమంటూ ఏమీ ఉండదు. ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మీ సంపద విలువ తగ్గిపోతుంది! దీనికోసం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం… 40 ఏళ్లున్న ముగ్గురు మిత్రులు వేర్వేరు చోట పనిచేస్తున్నారు… ఇందులో ఒక వ్యక్తి తాను ఉద్యోగంలో చేరిన రోజు నుంచీ నెలకు రూ.5వేలు మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేస్తూ వచ్చాడు. అంటే గత 15ఏళ్లుగా ఇతడు మదుపును కొనసాగిస్తున్నాడు. రెండో వ్యక్తి గత ఏడేళ్లుగా నెలకు రూ.5వేలు మదుపు చేస్తున్నాడు. మూడో వ్యక్తి గత మూడేళ్లుగా నెలకు రూ.5వేలు పెట్టుబడి ప్రారంభించాడు. అంచనా కోసం వార్షిక సగటు రాబడి 16శాతం వచ్చిందనుకుందాం…

మొదటి వ్యక్తి గత 15ఏళ్లుగా మదుపు చేస్తున్నాడు కాబట్టి… అతని వద్ద రూ.36.5లక్షలు, రెండో వ్యక్తి దగ్గర రూ.8.5లక్షలు, మూడో వ్యక్తి దగ్గర రూ.3లక్షలు మాత్రమే జమ అయ్యాయి. చూశారుగా… చక్రవడ్డీ ప్రభావం ఎలా పనిచేసిందో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని