Published : 16 May 2022 09:38 IST

Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. వెంటనే పుంజుకున్నాయి. గతవారపు భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. కొత్త గృహరుణాల వడ్డీరేట్లు తగ్గించాలన్న చైనా సెంట్రల్‌ బ్యాంకు నిర్ణయం మార్కెట్లకు సానుకూలాంశం. షాంఘైలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షల్ని పాక్షికంగా సడలించడం కూడా మార్కెట్లకు కలిసొచ్చే అంశం. అయితే, రేట్ల పెంపు, మందగమన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గరిష్ఠాల వద్ద అమ్మకాలు తప్పకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 348 పాయింట్ల లాభంతో 53,142 వద్ద, నిఫ్టీ (Nifty) 115 పాయింట్లు లాభపడి 15,898 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.65 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, టైటన్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఏమీ ఆర్గానిక్స్‌, భారత్‌ ఫోర్జ్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌ ఇండియా, దొడ్ల డెయిరీ, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌, జీఎస్‌కే, గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్‌, జీఆర్‌ఎం ఓవర్సీస్‌, మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ ఇండియా, నవభారత్‌ వెంచర్స్‌, పీడీఎస్‌, రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్, రేమండ్‌, వీఐపీ ఇండస్ట్రీస్

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

అదానీ గ్రూప్‌: సిమెంటు రంగంలోనూ దిగ్గజ సంస్థగా నిలిచేందుకు అదానీ గ్రూప్‌ ముందడుగు వేసింది. స్విస్‌ సిమెంట్‌ అగ్రగామి సంస్థ హోల్సిమ్‌కు చెందిన భారత వ్యాపారాన్ని 10.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.81,361 కోట్ల)తో స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ ఆదివారం తెలిపింది.

ఎస్‌బీఐ: ఎస్‌బీఐ నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈనెల 15 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

మారుతీ సుజుకీ: హరియాణాలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు కంపెనీ 800 ఎకరాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంది. ఏటా ఇక్కడ 2.5 లక్షల యూనిట్ల వాహనాల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రైట్స్‌: ఈస్ట్‌ బ్యాంక్‌-ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌ లింకేజ్‌ నిర్మాణానికి సంబంధించిన కన్సల్టెన్సీ, సూపర్‌విజన్‌ వర్క్‌ ప్రాజెక్టును గుయానా ప్రభుత్వం నుంచి 3204420 డాలర్లకు సొంతం చేసుకుంది.

నజారా టెక్నాలజీస్‌: ప్రతి షేరు మరో అదనపు షేరును కేటాయించనున్నారు.

పేటీఎం: అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూర్‌టెక్ షేర్‌ పర్చేజ్‌ ఒప్పందం ద్వారా రహేజా క్యూబీఈ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని సొంతం చేసుకోవాలన్న ఒప్పందాన్ని నిలిపివేసింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని