Sundar Pichai : గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ జీతంలో కోత!

కంపెనీలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆపై స్థాయిలో ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత ఉంటుందని పిచాయ్‌ ప్రకటించారు. వారితోపాటు తన జీతాన్ని కూడా పిచాయ్‌ తగ్గించుకోన్నట్లు సమాచారం. 

Updated : 29 Jan 2023 22:49 IST

వాషింగ్టన్‌: మాంద్యం భయాలు నెలకొన్న వేళ కార్పొరేట్‌ కంపెనీలలో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోంది. గత వారం గూగుల్ (Google) 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు విధించింది. తర్వాత ఉద్యోగులతో జరిగిన టౌన్‌ హాల్‌ సమావేశంలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆపై స్థాయిలో ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత ఉంటుందని సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ప్రకటించారు. సంవత్సరానికి  ఒకసారి ఇచ్చే బోనస్‌ను తగ్గించడంతో పాటు ఇకపై సీనియర్ ఉద్యోగులందరికీ  పని తీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఉంటుందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈవోగా పిచాయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన జీతంలో సైతం కోత విధించాలని సిబ్బందికి సూచించారట. అయితే, ఎంత శాతం కోత ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు.

గతవారం 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సుందర్‌ పిచాయ్‌ ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. దీంతో కొందరు ఉద్యోగులు సంస్థ తీరును తప్పుబట్టారు. లేఆఫ్‌లకు తాము సిద్ధంగా లేమని, యాజమాన్యానికి తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించే బదులు కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగులు తమ జీతాలను తగ్గించుకోవాలంటూ కొందరు విమర్శలు చేశారు. ఇటీవలే యాపిల్‌ (Apple) సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) తన జీతంలో  40 శాతం కోత విధించాలని కోరిన విషయాన్ని ఉదహరించారు. ఈ నేపథ్యంలో సుందర్‌ పిచాయ్‌ సైతం తన జీతం తగ్గించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

2020 నాటికి సుందర్‌ పిచాయ్‌ 2 మిలియన్ల డాలర్లు జీతంగా తీసుకుంటున్నట్లు సమాచారం. వీటితో పాటు కంపెనీ షేర్లు అదనం. ఐఐఎఫ్‌ఎల్ (IIFL) హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022 నివేదిక ప్రకారం పిచాయ్‌ నికర సంపద విలువ 20 శాతం మేర తగ్గి రూ. 5,300 కోట్లుగా ఉందని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని