Tata Tech IPO: టాటా టెక్‌ ఐపీఓ.. ఆఫర్‌ ప్రైస్‌ ఖరారు

Tata tech IPO: టాటా టెక్నాలజీ ఐపీఓ ఆఫర్ ప్రైస్‌ను టాటా మోటార్స్‌ రూ.500గా నిర్ణయించింది. డిసెంబర్‌ 5న షేర్లు లిస్ట్ కానున్నాయి.

Published : 25 Nov 2023 20:38 IST

Tata tech IPO | దిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ (Tata Tech IPO) ఆఫర్‌ ధర ఖరారైంది. ఐపీఓలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు సహా అందరికీ ఒక్కో షేరుకు ఆఫర్‌ ధరను రూ.500గా టాటా మోటార్స్‌ నిర్ణయించింది. ఐపీఓ సందర్భంగా ధరల శ్రేణిని రూ.475 - రూ.500గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బుక్‌ రన్నింగ్‌ మేనేజర్స్‌తో సంప్రదింపుల అనంతరం ఆఫర్‌ ధరను రూ.500గా నిర్ణయించినట్లు టాటా మోటార్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం రూ.3,042.5 కోట్ల ఐపీఓకు శుక్రవారంతో సబ్‌స్క్రిప్షన్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. 

మదుపరుల నుంచి అనూహ్య స్పందనతో ఐపీఓకు మొత్తంగా 69.43 రెట్లు స్పందన లభించింది. 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యేసరికి మొత్తంగా 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్‌ 6.08 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్‌ తమ వాటాలో 11.4 శాతాన్ని ఉపసంహరించుకుంటోంది. అదనంగా ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌ 2.4 శాతం, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌-I 1.2 శాతం వాటాలను విక్రయిస్తున్నాయి. షేర్ల కేటాయింపు నవంబరు 30న జరగనుండగా.. డిసెంబర్‌ 1 నుంచి రిఫండ్లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 4న డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ జరుగుతుంది. డిసెంబరు 5న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో టాటా టెక్‌ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని