Whatsapp payments: త్వరలో వాట్సాప్‌లోనూ క్యాష్‌బ్యాక్‌.. ఆ కంపెనీలకు గట్టి పోటీ!

Whatsapp payments: మే చివరి నాటికి వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్‌ సదుపాయం అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Published : 28 Apr 2022 01:42 IST

ఇంటర్నె్‌ట్‌ డెస్క్‌: దేశంలో యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొవిడ్‌ పుణ్యాన డిజిటల్‌ పేమెంట్స్‌ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి సంస్థలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వాట్సాప్‌ చాలా వెనుకబడి ఉంది. అయితే, ఇటీవలే 10 కోట్ల మంది వరకు పేమెంట్‌ సేవలను విస్తరించేందుకు నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌  ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ప్రజలకు చేరువయ్యేందుకు సిద్ధమైంది వాట్సాప్‌.

మే చివరి నాటికి వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్‌ సదుపాయం అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్కో యూజర్‌కు 33 రూపాయలు చొప్పున క్యాష్‌బ్యాక్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు లావాదేవీలకు గానూ ఈ మొత్తాన్ని క్యాష్‌బ్యాక్‌ కింద ఇవ్వనున్నారు. రిలయన్స్‌ జియో రీఛార్చి చేస్తే కూడా క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనునున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ చూడ్డానికి తక్కువగా ఉన్నా.. వాట్సాప్‌ పేమెంట్స్‌కు మారడానికి దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్‌తో వాటికి కష్టమే!

దేశంలో పేమెంట్స్‌ విభాగంలో ఫోన్‌పే హవా కొనసాగుతోంది. అమెరికా వాల్‌మార్ట్‌కు చెందిన ఈ సంస్థ అగ్రస్థానంలో ఉంది. అలాగే ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌ పే, యాంట్‌ గ్రూప్‌ మద్దతు ఉన్న పేటీఎం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, వాట్సాప్‌లో పేమెంట్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చి చాలా రోజులైనప్పటికీ యూజర్లకు విస్తరించడంపై పరిమితి ఉంది. తాజాగా ఆ పరిమితిని 10 కోట్లకు పెంచుకునేందుకు ఎన్‌పీసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో వాట్సాప్‌ విస్తరణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం భారత్‌లో వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. కేవలం మెసేజింగ్‌కే కాక, ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకోవడానికీ వాట్సాప్‌ ఉపయోగపడుతోంది. దీంతో వాట్సాప్‌ నిత్యజీవితంలో భాగమైపోయింది. ఇదే తరహాలో ఒకసారి పేమెంట్స్‌కు కూడా అలవాటు పడితే కేవలం పేమెంట్స్‌ సేవలు అందించే కంపెనీలకు మాత్రం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని