Hyundai: కొంపముంచిన ఒక్క పోస్ట్‌.. హ్యుందాయ్‌పై నెటిజన్ల ఫైర్‌!.. ఇంతకీ ఏమిటీ వివాదం?

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హ్యుందాయ్‌ కార్లను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో #BoycottHyundai హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

Published : 07 Feb 2022 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హ్యుందాయ్‌ కార్లను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో #BoycottHyundai హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. పాకిస్థాన్‌లో ఆ కంపెనీ సోషల్‌మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్‌ దీనికి కారణమైంది. హ్యుందాయ్‌ ఇండియా దీనిపై స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా సరే హ్యుందాయ్‌ క్షమాపణ చెప్పాలని, భారత్‌ విషయంలో ఆ కంపెనీ వైఖరిని వెల్లడించాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

హ్యుందాయ్‌ పాకిస్థాన్‌ సోషల్‌మీడియా ఖాతాలో శనివారం ఒక పోస్ట్‌ కనిపించింది. ‘‘కశ్మీర్‌ కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందాం. స్వాతంత్ర్యం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దాం’’ అని అందులో ఉంది. పాకిస్థాన్‌ ఏటా ఫిబ్రవరి 5న నిర్వహించే కశ్మీర్‌ సంస్మరణ దినం సందర్భంగా ఈ పోస్ట్‌ కనిపించడం వివాదానికి కారణమైంది. కశ్మీర్‌ వేర్పాటు వాదులకు మద్దతిచ్చేలా ఇది ఉందంటూ భారత్‌లో దీనిపై దుమారం రేగింది.

కాసేపటికే పోస్ట్‌ తొలగించినప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో భారత్‌లో కంపెనీపై వ్యతిరేకత మొదలైంది. ఆ కంపెనీ పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. కాసేపటికే బాయ్‌కాట్‌ హ్యుందాయ్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ మొదలైంది. హ్యుందాయ్‌ అనుబంధ సంస్థ కియా సైతం అక్కడి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టే పెట్టినప్పటికీ కాసేపటికే దాన్ని తొలగించింది. 

సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను గమనించిన హ్యుందాయ్‌.. నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ మేరకు ఆదివారం రాత్రి హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని, జాతీయవాదానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని పేర్కొంది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియాను లింక్‌ చేస్తూ వస్తున్న కొన్ని పోస్టులు కంపెనీ నిబద్ధతను, దేశం కోసం చేస్తున్న సేవను కించపరిచేలా ఉన్నాయని తెలిపింది. అయినా సున్నితమైన అంశాల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ విషయాన్ని ప్రస్తావించకుండా వివరణ ఇచ్చింది. హ్యుందాయ్‌ బ్రాండ్‌కు భారత్‌ రెండో ఇల్లని ఈ సందర్భంగా తెలిపింది.

క్షమాపణ చెప్సాల్సిందే.. 
హ్యుందాయ్‌ వివరణ ఇచ్చిన తర్వాత శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ అంశంపై స్పందించారు. హ్యుందాయ్‌ ఇచ్చిన వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. మరోవైపు భాజపా సభ్యుడైన డాక్టర్‌ విజయ్‌ చౌతాయ్‌వాలే సైతం హ్యుందాయ్‌ ప్రకటనపై మండిపడ్డారు. పాకిస్థాన్‌ హ్యుందాయ్‌ పోస్టుకు కంపెనీ మద్దతుగా నిలుస్తోందా? గ్లోబల్‌గా భారత్‌ విషయంలో మీ వైఖరి ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారం ఇంకా ఎటువైపు వెళ్తుందో చూడాలి!!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని