Zomato: ‘అన్యాయమైన ఛార్జీలు’.. జొమాటోపై కస్టమర్‌ అసంతృప్తి.. స్పందించిన సంస్థ

Zomato: డెలివరీ బిల్లులో అధికమొత్తంలో ఛార్జీలు విధించారని జొమాటోపై ట్విటర్‌ వేదికగా ఓ మహిళ తన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి జొమాటో స్పందించింది.

Updated : 08 Aug 2023 12:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జొమాటో నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన మహిళ బిల్లు చూసి షాకైంది. డెలివరీ బిల్లులో అనవసరంగా కంటైనర్‌ ఛార్జీలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా జొమాటోకు(Zomato) ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను కూడా ఆమె ట్యాగ్‌ చేసింది.

అహ్మదాబాద్‌కు చెందిన ఖుష్బూ ఠక్కర్ అనే మహిళ మూడు ప్లేట్ల దూదీ తేప్లా (రోటీ వంటిది) ఆహారాన్ని జొమాటోలో ఆర్డర్ చేసింది. ఆర్డర్‌ డెలివరీ సమయంలో బాయ్‌ ఇచ్చిన బిల్లును చూసి ఆమె అవాక్కైంది. మూడు ప్లేట్ల ఆహారానికి రూ.180 ధర ఉంది. దీనిలో కేవలం ప్యాకింగ్‌ కోసం ఉపయోగించే కంటైనర్‌లకు అదనంగా రూ.60 వసూలు చేస్తున్నట్లు ఉంది. ‘నేను ఆర్డర్‌ చేసిన ఆహారానికి సమానంగా కంటైనర్‌ ధర వసూలు చేస్తారా?’ అంటూ ట్విటర్‌ వేదికగా జొమాటోను ప్రశ్నించింది. కంటైనర్‌ పేరిట అన్యాయంగా అదనపు సొమ్ము వసూలు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై జొమాటో స్పందించింది. కంటైనర్‌ ఛార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని స్పష్టం చేసింది. 

 రైల్లో లోయర్‌ బెర్త్‌ కావాలా? ఈసారి ఇలా చేయండి..

‘హోయ్‌ ఖుష్బూ, పన్ను విధించటం అనేది సాధారణం. ఆర్డర్‌ చేసే ఆహారానికి అనుగుణంగా 5శాతం నుంచి 18శాతం వరకు రెస్టారంట్లు చెల్లించే పన్ను ఛార్జీలు ఉంటాయి. దీంతోపాటు రెస్టారంట్లు పాక్యేజీ ఛార్జీలను విధిస్తాయి. వారు ఈ మార్గంలోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు’ అంటూ జొమాటో సమాధానం ఇచ్చింది. అయితే, జొమాటో సమాధానంతో ఈ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది. ‘ఈ అదనపు ఛార్జీలు చాలా చిరాకు తెప్పిస్తాయి’ అంటూ కొందరు మహిళకు మద్దతుగా కామెంట్లు చేశారు. ‘ఆర్డర్ చేసే ముందే ప్యాకేజీ ఛార్జీలు చూసుకోవాల్సింది’ అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని