Zomato Q2 Results: సెప్టెంబర్‌ త్రైమాసికంలో జొమాటో ఆదాయం రూ.2,848 కోట్లు

Zomato Q2 Results: దాదాపు అన్ని వ్యాపారాల్లో వృద్ధి నమోదైన నేపథ్యంలోనే మెరుగైన ఫలితాలు నమోదైనట్లు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

Published : 03 Nov 2023 17:38 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాల (Zomato Q2 Results)ను శుక్రవారం ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన రూ.36 కోట్ల ‘పన్నుల తర్వాత లాభాల’ (Zomato PAT)ను నమోదు చేసింది. ఆదాయం పెరగడం వల్లే లాభాలు పుంజుకున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో పేర్కొంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.251 కోట్ల నష్టాలను నివేదించింది.

సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా జొమాటో ఆదాయం (Zomato Q2 Revenue) రూ.2,848 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,661 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు రూ.3,039 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి రూ.2,092 కోట్లుగా ఉన్నాయి. పోర్చుగల్‌లో ఉన్న అనుబంధ కంపెనీ జడ్‌ఎంటీ ఐరోపా ఎల్‌డీఏలోని 30 శాతం ఓటింగ్‌ హక్కులను దాదాపు రూ.1.59 కోట్లకు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు తమ క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ ఈ మూడు నెలల వ్యవధిలో తొలిసారి పాజిటివ్‌ ఫలితాలను నమోదు చేసినట్లు వాటాదారులకు రాసిన లేఖలో వెల్లడించింది.

దాదాపు అన్ని వ్యాపారాల్లో వృద్ధి నమోదైన నేపథ్యంలోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12 కోట్ల EBITDA ఈసారి రూ.41 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాట్‌ఫామ్‌ ఫీజుపై కంపెనీ సీఎఫ్‌ఓ అక్షంత్‌ స్పందించారు. 2023-24 రెండో త్రైమాసికం నుంచి ఒక్కో ఆర్డర్‌పై రూ.2-5 నామమాత్రపు ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. గోల్డ్‌ సభ్యత్వం ఉన్నవారికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. దీర్ఘకాలంలో కంపెనీ ఆరోగ్యకరమైన పనితీరు కోసమే దీన్ని వసూలు చేస్తున్నట్లు వివరించారు. తమ కస్టమర్లకు జొమాటో సేవలను ఎప్పుడూ అందుబాటులోనే ఉంచుతామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని