‘విషాద’ యాత్ర.. ముగ్గురు IIT విద్యార్థులు సహా ఏడుగురి దుర్మరణం

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లాలో టెంపో వాహనం లోయలో.....

Published : 26 Sep 2022 16:27 IST

సిమ్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో టెంపో వాహనం లోయలో పడటంతో ఏడుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు ఐఐటీ వారణాసికి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 10మందికి గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 8.30గంటల సమయంలో బంజర్‌ సబ్‌డివిజన్‌లోని ఘియాఘిలో చోటుచేసుకున్నట్టు తెలిపారు. దిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌కు చెందిన పలువురు విహార యాత్రకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో పెను విషాదం నింపింది.

ఈ ప్రమాదంలో తొలుత ఐదుగురు పర్యాటకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు వారణాసి ఐఐటీకి చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మృతుల్లో ఆరుగురిని గుర్తించిన పోలీసులు.. వారిలో దిల్లీకి చెందిన సౌరభ్‌, ప్రియాంక గుప్తా, కిరణ్‌తో పాటు యూపీకి చెందిన రిషబ్‌ రాజ్‌, అన్షిక జైన్‌, ఆదిత్య ఉన్నట్టు కుల్లు ఎస్పీ గురుదేవ్‌ శర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో హరియాణా, యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్టు పేర్కొన్నారు. చీకట్లోనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను తొలుత  ఆస్పత్రికి తీసుకెళ్లిన స్థానికులు, అధికార యంత్రాంగం.. మెరుగైన చికిత్స కోసం వారిని కుల్లూలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఘటన బాధాకరం..  మోదీ ట్వీట్‌

పర్యాటకుల వాహనం ప్రమాదానికి గురికావడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులకు సూచించారు. గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు