
హాథ్రస్ కేసు వాదించనున్న నిర్భయ న్యాయవాది
ఆ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతించటం లేదు: సీమా కుష్వాహా
హాథ్రస్: నిర్భయ కేసును వాదించి గెలిపించిన ప్రముఖ మహిళా న్యాయవాది సీమా కుష్వాహా.. హాథ్రస్ బాధితురాలి కేసునూ వాదించనున్నట్టు సమాచారం. కాగా, సీమ గురువారం బాధితురాలి కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆమెను పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘వారి తరఫున నిలబడి న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి కుటుంబ సభ్యులు నన్ను కోరారు. అయితే అధికార యంత్రాంగం వారిని కలిసేందుకు అనుమతించటం లేదు. కానీ ఆ కుటుంబాన్ని కలవకుండా నేను తిరిగి వెళ్లేది లేదు’’ అని మీడియాతో అన్నారు. బాధితురాలి సోదరుడితో తాను సంప్రదింపులు జరుపుతున్నాని ఆమె తెలిపారు.
డిసెంబర్ 16, 2012న దిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటనలో సీమా కుష్వాహా బాధితురాలి తరఫున వాదించి ఆ కేసును గెలిపించారు. ఇక హాథ్రస్ ఘటనలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో నిర్ధారణ కాలేదని అదనపు డైరక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఆరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.