ఇంకా నయం, ఎన్‌కౌంటర్‌ కాలేదు

నన్ను ముంబై నుంచి మథురకు తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను.

Published : 03 Sep 2020 02:44 IST

విడుదలైన యూపీ వైద్యుడి సంచలన వ్యాఖ్యలు

మథుర: దేశద్రోహ ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌‌ వైద్యుడు డా.కఫీల్ ఖాన్.. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు విడుదలయ్యారు. బుధవారం అర్ధరాత్రి విడుదలైన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా ప్రసంగంలో హింస, విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుకు ధన్యవాదాలు. అలాగే నన్ను ముంబై నుంచి మథురకు తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మార్గమధ్యలోనే నన్ను ఎన్‌కౌంటర్ చేయకుండా జైలుకు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు.’’ అని కఫీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనను ఇంకో కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డా.కఫీల్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహించేవారు. ఆగస్టు 2017న ఆక్సిజన్‌ అందకపోవటంతో 60 మంది శిశువులు మృతిచెందిన ఘటనలో... విధినిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఈయనను సస్పెండ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు తొమ్మిది నెలల పాటు జైలులో ఉన్న అనంతరం నిర్దోషిగా విడుదలయ్యారు.

 కఫీల్‌ ఖాన్‌ జనవరి 29నాటి అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని.. ఆయనపై దేశ ద్రోహం అభియోగాలు మోపుతూ జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నాటి ప్రసంగంలో హింస, విద్వేషపూరిత అంశాలేవీ లేవని అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని మథుర కారాగారం నుంచి బుధవారం అర్ధరాత్రి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కఫీల్‌ ఖాన్‌ మాట్లాడుతూ తనను ప్రభుత్వ విధుల్లో చేరేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని