Crime News: పులిచర్మం అమ్మేందుకు యత్నించిన ఐదుగురి అరెస్టు

ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వైజంక్షన్‌ వద్ద పులిచర్మం అమ్మడానికి ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పులిచర్మం, మూడు సెల్‌ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలను

Updated : 22 Dec 2021 14:01 IST

పులిచర్మాన్ని పరిశీలిస్తున్న ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌, డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ఇతర అధికారులు

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వైజంక్షన్‌ వద్ద పులిచర్మం అమ్మడానికి ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పులిచర్మం, మూడు సెల్‌ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌, జిల్లా అటవీ అధికారి ప్రదీప్‌కుమార్‌శెట్టి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వివరాలు వెల్లడించారు. సమాచారం మేరకు జిల్లాలోని అన్ని సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. జగన్నాథపురం వై జంక్షన్‌ వద్ద ఉదయం ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వివరాలు రాబట్టారు. వారి వద్ద ఉన్న సంచిలో పులిచర్మం ఉన్నట్లు గుర్తించారు. దూలాపురం అటవీ అధికారులతో పంచనామా నిర్వహించగా, నిజమైన పులిచర్మం అని తేలింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు నిందితులు తెలిపారు. వెంకటాపురం మండలం కొండాపురంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పూనెం విఘ్నేష్‌ (23), సెంట్రింగ్‌ వర్కర్‌ సోయం రమేష్‌ (37), ఏటూరునాగారం మండలం గోవుపల్లి గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ చిరా శ్రీను(32), టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ చింతల బాలకృష్ణ (25), కూలి పనులు చేసే సోది చంటి (23) నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. పెద్దపులికి సంబంధించిన పూర్తి వివరాలేవీ తెలియలేదని, దర్యాప్తు చేపట్టి త్వరలో చెబుతామని జిల్లా అటవీఅధికారి అన్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్‌, వెంకటాపురం సీఐ కె.శివప్రసాద్‌, ఎస్సైలు జి.తిరుపతి, కె.తిరుపతిరావు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని