Palnadu: ‘కంపెనీ నడపాలంటే కప్పం కట్టాల్సిందే’

‘పంచాయతీ పరిధిలో కంపెనీ నడపాలంటే ప్రతినెలా కప్పం కట్టాలి.. మమ్మల్ని కాదని ముందుకెళ్తే నీ సంగతి చూస్తాం.

Updated : 27 Oct 2023 08:28 IST

వైకాపా నేత దాడిపై ప్రవాస పారిశ్రామికవేత్త ఫిర్యాదు

నరసరావుపేట టౌన్‌, న్యూస్‌టుడే: ‘పంచాయతీ పరిధిలో కంపెనీ నడపాలంటే ప్రతినెలా కప్పం కట్టాలి.. మమ్మల్ని కాదని ముందుకెళ్తే నీ సంగతి చూస్తాం. కంపెనీ మూసేసినా గత లాభాల్లో వాటాలు పంచాలి.. లేదంటే ఖబడ్దార్‌’ అంటూ వైకాపా నేత ఒకరు తన అనుచరులతో ప్రవాస పారిశ్రామికవేత్తపై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. ఇందులో వాలంటీర్‌ కూడా కీలకపాత్ర పోషించారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలిలా.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుకు చెందిన నాతాని వెంకట్రావు ప్రవాసాంధ్రుడు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి, జన్మభూమిపై మమకారంతో సిమెంట్‌ స్తంభాల తయారీ యూనిట్లు నాలుగు నెలకొల్పారు. సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అందులో ఒకటి నరసరావుపేట మండలం బసికాపురం పంచాయతీ పరిధిలో నిర్మించారు. ఇది తమ పంచాయతీలో ఉన్నందున ప్రతినెలా తనకు కప్పం చెల్లించాలని వెంకట్రావును ఉపసర్పంచి, వైకాపా నేత వంపుగుడి రాజేష్‌ డిమాండు చేశారు.

ఇందుకు ఆయన నిరాకరించడంతో రెచ్చగొట్టే చర్యలకు తన అనుచరులను ఉసిగొల్పారు. పరిశ్రమలో పనిచేసే మహిళలు, కార్మికులతో అసభ్యంగా ప్రవర్తించారు. సామగ్రి లారీలను పరిశ్రమలోకి వెళ్లకుండా పలుమార్లు అడ్డగించారు. ఈ నెల 23న గ్రామ వాలంటీరు అక్షయ్‌, రైల్వే ఉద్యోగి చిన్నయ్య, మరో 50 మంది కలిసి ముసుగులు ధరించి కంపెనీలోకి ప్రవేశించి రాళ్లు విసిరారు. అడ్డొచ్చిన వారిని కొట్టారు. వెంకట్రావుపై దుర్భాషలాడి చేయి చేసుకున్నారు. అపహరించేందుకు ప్రయత్నించి, కార్మికులు ప్రతిఘటించడంతో వదిలేశారు. నీ అంతు చూస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. దీంతో తనకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్య తీసుకోవాలని వెంకట్రావు నరసరావుపేట గ్రామీణ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామీణ ఎస్సై బాలనాగిరెడ్డి గురువారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఫిర్యాదుపై విచారిస్తున్నామని, తగిన చర్య తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని